ఎన్నికలపై నిరంతర నిఘా
● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో మంగళవారం ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపులుగా ఉండడం పూర్తిగా నిషేధమని చెప్పారు. సెన్సిటివ్, హై సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద అదనపు పికెటింగ్, వీడియో రికార్డింగ్, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామని, పోలింగ్ స్టేషన్ పరిసరాల్లోకి ప్రచార సామగ్రి, మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు తీసుకురావొద్దన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ సెంటర్లకు తరలిస్తామన్నారు. ఆయా ప్రాంతాలన్నీ పోలీసుల పర్యవేక్షణలో ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. అన్నిచోట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల రాకపోకలు, రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఉద్రిక్తత, ప్రజలు గుంపులుగా ఉండడం, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడని ఆదేశించారు. ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, మొత్తం 1,000 మంది పోలీసు సిబ్బంది మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లాలోని పౌరులు ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా భావించి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని ఎస్పీ ప్రజలను కోరారు.


