తట్టెడు మట్టి పోయలేదు..
● శిలాఫలకానికి పూలు చల్లి నిరసన
తెలిపిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
కురవి: మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవన సముదాయానికి వేసిన శంకుస్థాపన శిలాఫలకానికి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్నంగా సంవత్సరీకం కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ శిలాఫలాకానికి పూలుచల్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యంగ్ ఇండియా సమీకృత గురుకుల సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఏడాది పూర్తి అయినప్పటికీ తట్టెడుమట్టి పోయలేదని, ఒక ఇటుక పేర్చలేదని విమర్శించారు. అగ్రిమెంట్, పరిపాలన అనుమతులు కాలేదన్నారు. ఇది ప్రజాపాలన కాదని, దివాళాకోరు పాలన అని మండిపడ్డారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ కార్యాలయాల నిర్మాణాలపై లేదన్నారు. ఇన్‌చార్జ్ మంత్రి, ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి వదిలేశారని, ఇదే రోడ్డుపై ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ వెళ్తున్నారని ఇది కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ గ్లోబల్‌సమ్మిట్ ప్లాఫ్ అయిందని తెలిపారు. సమ్మిట్ స్టేజ్ మాత్రం కాంగ్రెస్ నాయకులతో నిండిందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రపంచంలో పేరుగాంచిన కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ హాయంలో సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ పేరుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారని తెలిపారు. చుట్టపుచూపుగా వచ్చే ఎమ్మెల్యేను చూస్తున్నామని, బండిమీద తిరుగుతున్నాడని తెలిపారు. కార్యక్రమంలో బజ్జూరి పిచ్చిరెడ్డి, గుగులోత్‌రవి, బోడశ్రీను, బాదె నాగయ్య, నూతక్కి నర్సింహరావు, బాదావత్ రాజులక్ష్మి, కల్లెపు శ్రీను, గుగులోత్ నెహ్రూనాయక్ పాల్గొన్నారు.


