పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
మహబూబాబాద్: మొదటి విడత జీపీ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆమె మొదటి విడత ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సాధారణ వ్యయ పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 11న నిర్వహించే మొదటి ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఓటరు స్లిప్‌లు సమాచారం కోసమే అని, గుర్తింపు పత్రంగా పరిగణించొద్దన్నారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారే ఓటు వేయాలన్నారు. ఓటర్లు గుర్తింపు కోసం ఎపిక్ కార్డు (ఓటరు ఐడీ ), లేదా ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాసుపుస్తకం.. ఇందులో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చన్నారు. పోలింగ్ ప్రారంభానికి గంట ముందు ఏజెంట్‌ల ఎదుట మాక్‌పోలింగ్ ఉంటుందన్నారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. మొదటి విడతలో ఐదు మండలాలు ఉన్నాయని, పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీసీలో జిల్లా నుంచి ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, ఎన్నికల వ్యయ పరిశీలకుడు మధుకర్ బాబు, శ్రీనివాస్, డీపీఓ హరిప్రసాద్ పాల్గొన్నారు.


