ప్రచారం కాదు.. పరీక్ష!
గట్లపై కొందరు.. బురదలో మరికొందరు
● ఓటు కావాలంటే బురదలో దిగాల్సిందే
● ఉదయం, సాయంత్రం పొలంబాట
● సర్పంచ్ అభ్యర్థుల వినూత్న ప్రచారం
జనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ప్ర చారం ఊళ్లలో కాదు.. పొలాల్లో దూసుకుపోతోంది. ఓటు అడగాలంటే బురదలో అడుగేయాలన్న ని బంధనలను అభ్యర్థులు అక్షరాలా అనుసరిస్తున్నా రు. రైతు తెల్లవారుజామున పొలాల్లోకి దిగితే, నేతలు వెంటపడి మట్టిలో మునిగిపోతున్నారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓ టు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వానాకా లం వరి కోతలు, పత్తి సేకరణ, అమ్మకాలు చివరి దశకు చేరుకోగా.. మరోవైపు యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సూర్యోదయానికి ముందే రైతులు పనిముట్లు భుజాన వేసుకుని వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నారు. సాయంత్రం వరకూ మట్టితో మమేకమైపోతున్నారు. దీంతో అభ్యర్థులకు మెజార్టీ ఓటర్లు దొరకడం లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో గంట నుంచి రెండు గంటలపాటు పొలం గట్లకు కేటాయిస్తున్నారు. ఓటరు ఇంట్లో లేడా.. పొలంలో ఉన్నాడా.. అయితే మన ప్రచారం కూడా అక్కడికే అనే ఫార్ములాతో అభ్యర్థులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఉదయం పది గంటల వరకు గ్రామాల్లో తిరిగి, ఆ తర్వాత పొలం బాట పడుతున్నారు. బురదలో మునిగిన పొలం అంచుల్లో అభ్యర్థుల ప్రచార హడావుడి కనిపిస్తోంది.
చాలా గ్రామాల్లో కొంతమంది అభ్యర్థులు రైతులతోపాటు బురదలోకి దిగుతూ.. గట్లను చదును చేయడం, నీటి కాల్వలు వదలడం వంటి పనులు చేస్తున్నారు. అన్నయ్య.. తాతా.. ఇదే మా గుర్తు, ఇదే మా మాట అంటూ చేతిలో బ్యాలెట్ పత్రం నమూనా పట్టుకుని బురదలో నిల్చున్న దృశ్యాలు ఈ ఎన్నికల్లో సాధారణం అయ్యాయి. రాజకీయాలు ఈసారి నిజంగానే మట్టిలో పుట్టి, మట్టిలోనే పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రచారం ఉత్సాహంగా సాగుతున్నా అసలు హడావుడి పొలాల్లోనే కనిపిస్తోంది. రైతు పనుల్లో మునిగిపోయిన వేళ అభ్యర్థులు సైతం అతడి వెంటే నడుస్తున్నాడు. పొలంలో పనిచేస్తే ఓటు అన్నట్లు ఈసారి సర్పంచ్ అభ్యర్థుల ప్రచార శైలి రోజుకో కొత్త మలుపు తిరుతోంది.
ప్రచారం కాదు.. పరీక్ష!
ప్రచారం కాదు.. పరీక్ష!


