ఎవ్రీడే 90 ఎంఎల్..!
గీసుకొండ: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తి కలిగిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పోలింగ్ జరిగే రెండు, మూడు రోజుల ముందు నుంచి గ్రామాల్లో తమకు అనుకూలమైన వారికి, వ్యతిరేకులకు మద్యం తాగిస్తున్నారు. తమ గెలుపు కోసం రోజూ ప్రచారం చేసే బ్యాచ్‌తో పాటు.. తమకు తప్పకుండా ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారికి, తమకు ఓటు వేయరేమో అనే అనుమానంతో ఉన్న వారికి ప్రతీ రోజు 90 ఎంఎల్ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని వైన్ షాపుల నిర్వాహకులు 90 ఎంఎల్ మద్యం బాటిళ్లను ఎక్కువ స్టాక్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రోజూ 90 ఎంఎల్ మద్యం అభ్యర్థులు ఇంటికే పంపిస్తుండడంతో కొందరు ఓటర్లు ఆనంద పడుతున్నారు.
వాళ్ల దావత్‌కు పోయివస్తా.. ఓటు మాత్రం నీకే
సంగెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విచిత్రాలు సర్పంచ్ అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు దావత్‌లు ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఓటర్లు ఎవరి మాట కాదనలేక పిలిచిన ప్రతీ అభ్యర్థి దావత్‌కు, విందులకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థి తారసపడి గా దావత్‌కు ఎందుకు పోయినవే అడితే పిలిస్తే పోకపోతే బాగుండదని వెళ్లిన గాని ఓటు మాత్రం నీకే వేస్తా అంటూ మభ్యపెట్టుతున్నారు. ఇంకాకొందరైతే ముందుగానే అభ్యర్థితో గా అభ్యర్థి దావత్‌కు పిలిచిండు పోయి వస్తా ఏమి అనుకోవద్దు అంటూ వెళ్లొస్తున్నారు. అంతేగాక అక్కడ గా మందు బ్రాండ్ పెట్టారని, ఇక్కడ ఈ మందు బ్రాండ్ పెట్టుతున్నారని విమర్శలు సైతం చేస్తూ దావత్‌లు ఇచ్చిన వారినే మాటలు అంటున్న పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతుందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.
● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డోర్ డెలివరీ
ఎవ్రీడే 90 ఎంఎల్..!


