350 ప్రత్యేక సైలెన్సర్ల ధ్వంసం
కాజీపేట : కాజీపేట చౌరస్తాలో మంగళవారం 360 ద్విచక్ర వాహనాల ప్రత్యేక సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. భీకర శబ్దంతో నగరంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టుబడిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రోలర్‌తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను బిగిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐలు వెంకన్న, సుజాత, సీతారాంరెడ్డి, ఎస్సైలు సంపత్, కనకచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
సెల్‌టవర్ ఎక్కి రైతు ఆందోళన
కేసముద్రం: కొనుగోలు కేంద్రంలో విక్రయించిన తన ధాన్యాన్ని తరలించడం లేదంటూ ఓ రైతు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన మంగళవారం మండలంలోని మహమూద్‌పట్నంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రైతు ఎశబోయిన మురళి ఇదే గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తన ధాన్యం తీసుకొచ్చాడు. కాంటా పూర్తయినా తరలించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ సమీపంలో గల సెల్‌టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. విషయం తెలుసుకున్న సెకండ్ ఎస్సై నరేశ్ ఘటనాస్థలికి చేరుకుని ఆ రైతుకు నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. కాగా, సదరు రైతు తీసుకొచ్చిన ధాన్యానికి కాంటా వేశామని, తరలించేందుకు డీసీఎం కూడా వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.
350 ప్రత్యేక సైలెన్సర్ల ధ్వంసం
350 ప్రత్యేక సైలెన్సర్ల ధ్వంసం


