భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
● ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం డి.విజయభాను
హన్మకొండ: మేడారం భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను సూచించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో రీజియన్‌లోని అన్ని డిపోల మెకానికల్ సూ పర్ వైజర్లు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లు, స్టోర్ సూపర్ వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర–2026కు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. జాతరకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర సమయంలో బస్సులు మరమ్మతులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతర విధుల్లో పాల్గొనే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిపై సేఫ్టీ వార్డెన్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తిస్తుందన్నారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంలు పి.మహేశ్, కేశరాజు భాను కిరణ్, అకౌంట్స్ మేనేజర్ ఎ.రవీందర్ పాల్గొన్నారు.
సీపీని కలిసిన ఆర్టీసీ ఆర్‌ఎం..
వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను టీజీ ఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను కలిశారు. మంగళవారం హనుమకొండలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సీపీని మర్యాద పూర్వకంగా కలిసి మేడారం జాతరకు ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. పోలీసు శాఖ ద్వారా సహకారం అందించాలని కోరుతూ లేఖ అందించారు. హనుమకొండ డీఎం ధరమ్ సింగ్ పాల్గొన్నారు.


