వ్యక్తి హత్య కేసులో నలుగురి అరెస్ట్
పలిమెల : మంత్రాల నెపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు మహాదేవ్‌పూర్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పలిమెల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివారలు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల పంకెన గ్రామానికి చెందిన చిలుమలు రాజయ్య, చిలుముల సంతోశ్.. తమ తల్లి తరచూ అనారోగ్యం కావడానికి అదే గ్రామానికి చెందిన సోదరి బక్కయ్య కారణమని భావించారు. బక్కయ్య మంత్రాలు చేయడంతోనే తమ తల్లి అనారోగ్యానికి గురవుతోందని, అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకు తమ బంధువులు పాగే శ్రీనివాస్, పాగే రామయ్యకు విషయం చెప్పగా వారు సరే అన్నారు. దీంతో నలుగురు కలిసి కలిసి గత నెల (నవంబర్) 25వ తేదీన రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న బక్కయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బక్కయ్య వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఈనెల 7న మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పలిమెల పోలీసులు.. దర్యాప్తులో భాగంగా రాజయ్య, సంతోష్, శ్రీనివాస్, రామయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో పలిమెల ఎస్సై జె.రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన పోలీసులు


