ఇంట గెలవాలి | - | Sakshi
Sakshi News home page

ఇంట గెలవాలి

Dec 9 2025 10:35 AM | Updated on Dec 9 2025 10:35 AM

ఇంట గ

ఇంట గెలవాలి

ప్రజాప్రతినిధులు, నాయకుల సొంత గ్రామాల్లో అనుచరుల పోటీ

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారు, మంత్రిగా ఎదిగిన వారు ఉన్నారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వారు తమ సొంత గ్రామాల్లో మద్దతుదారులను గెలిపించుకోవడం కీలకంగా భావిస్తున్నారు. ఈమేరకు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు తమ మద్దతుదారులను పోటీలో దించారు. వీరికి దీటుగా బీఆర్‌ఎస్‌ కూడా తమ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారు. దీంతో సొంత గ్రామాల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపై పడింది. నియోజకవర్గం అంతా ఒక లెక్క.. సొంత గ్రామం మరో లెక్కగా భావించి ఇరు పార్టీల నాయకులు ప్రచారం చేస్తూ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నారు.

మహబూబాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ సొంత గ్రామం మహబూబాబాద్‌ మండలంలోని సోమ్లా తండా. తండాలో మొత్తం 914 మంది ఓటర్లు ఉంటారు. గత ఎన్నికల్లో తండాకు చెందిన ఇస్లావత్‌ బాలాజీ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారుడిగా బరిలో నిలిచి గెలిచారు. ఇప్పుడు బాలాజీకి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇవ్వలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్‌ మద్దతుతో ఎమ్మెల్యే సోదరుడు భూక్య దళ్‌సింగ్‌ భార్య కౌసల్య పోటీలో ఉంది. బీఆర్‌ఎస్‌ మద్దతుతో దారావత్‌ భారతి పోటీలో ఉంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన ఇద్దరు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్‌ కాంగ్రెస్‌ మద్దతుదారు, తన అన్న భార్య కౌసల్యను గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నారు.

డోర్నకల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచంద్రునాయక్‌ స్వగ్రామం జిల్లాలోని పెద్దవంగర మండలం నెహ్రూతండా. ఈ తండా రెడ్డికుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. పంచాయతీలో మొత్తం ఆరు వార్డులు ఉన్నాయి. 395 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో తండాకు చెందిన బానోత్‌ జగ్గానాయక్‌ కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌ మద్దతుగా మాజీ సర్పంచ్‌ జగ్గానాయక్‌తోపాటు, బీఆర్‌ఎస్‌ మద్దతు అభ్యర్థి బానోత్‌ శంకర్‌ పోటీలో ఉన్నారు. ఇరువురి మధ్య గట్టి పోటీ ఉంది. అయితే ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌కు జగ్గానాయక్‌ను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ స్వగ్రామం డోర్నకల్‌ నియోజకవర్గంలోని కురవి మండలం గుండ్రాతి మడుగు శివారు పెద్దతండా గ్రామ పంచాయతీ. 1,680 మంది ఓటర్లు ఉన్నారు. గత పర్యాయం సత్యవతి రాథోడ్‌ మేనల్లుడు శ్రీరాం భార్య వనజ గెలిచింది. ఇప్పుడు 13 మంది పోటీలో ఉన్నారు. అయితే సర్పంచ్‌ను ఏకగ్రీవంగా చేసేందుకు సత్యవతి రాథోడ్‌ ప్రయత్నిస్తున్నారు. ఏకగ్రీవం కాకపోతే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య పోటీ ఉంటుంది. దీంతో బీఆర్‌ఎస్‌ మద్దతు అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత సత్యవతి రాథోడ్‌దే అంటున్నారు.

రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం కొత్తగూడ మండలం మొండ్రాయి గూడెం పంచాయతీలోని మోకాళ్లపల్లి. ఈ పంచాయితీలో మొత్తం 398 మంది ఓటర్లు ఉన్నారు. గత పర్యాయం కాంగ్రెస్‌ మద్దతుతో బంగారి భారతి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ మద్దతుతో వంక రాములు నామినేషన్‌ వేశారు. బీఆర్‌ఎస్‌ మద్దతుతో బంగారి నరేష్‌ పోటీలో ఉన్నారు. అయితే ఎన్నికలు లేకుండా సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం.. లేదా పోటీ అనివార్యమైతే తమ మద్దతుదారుడు రాములును గెలిపించుకునే బాధ్యత మంత్రి సీతక్కపైన ఉంది.

మాజీమంత్రి డీఎస్‌ రెడ్యానాయక్‌, ఆమె కూతురు మాజీ ఎంపీ కవిత స్వగ్రామం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి. ఈ పంచాయతీలో 1800 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో రెడ్యానాయక్‌ అనుచరుడు మల్లేశం సర్పంచ్‌గా గెలిచారు. ఇప్పుడు తన అనుచరుడు అయూబ్‌ పాషాను బీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేయించారు. కాంగ్రెస్‌ మద్దతుతో భర్తపురం యాకయ్య బరిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో అయూబ్‌ పాషాను గెలిపించుకుకోవడం మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు కీలకంగా మారింది.

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సొంత గ్రామం తొర్రూరు మండలం చర్లపాలెం. ఈ పంచాయితీలో 2,300 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారు సట్ల నాగలక్ష్మి సర్పంచ్‌గా గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌ మద్దతుతో ధర్మారపు కిరణ్‌, కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి ధర్మారపు మహేందర్‌ పోటీలో ఉన్నారు. దీంతో అనివార్యంగా బీఆర్‌ఎస్‌ మద్దతు మహేందర్‌కు ప్రకటించింది. సొంత ఊరిలో మద్దతుదారుడు ధర్మారపు కిరణ్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై ఉంది.

గెలిపించుకునేందుకు ప్రయత్నాలు, స్వయంగా ప్రచారం

పలుచోట్ల గట్టిపోటీ ఎదుర్కొంటున్న మద్దతుదారులు

ఇంట గెలవాలి1
1/2

ఇంట గెలవాలి

ఇంట గెలవాలి2
2/2

ఇంట గెలవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement