అనుమతులు లేకుండా అడ్మిషన్లు
మహబూబాబాద్ అర్బన్: విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఏటా ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా యి. పలువురు అనుమతులు తీసుకోకుండా విద్యాసంస్థలను నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆకర్షణీయమైన బ్యానర్లు, పోస్టర్లు వేసి పెద్దఎత్తున అడ్మిషన్లు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో చాలా ప్రైవేట్ స్కూ ళ్లు ప్రభుత్వ గుర్తింపు లేకుండా వెలిసినా.. బయటపడ్డవి కొన్ని మాత్రమే. అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో అనుమతులు లేని పాఠశాలలు వెలు గులోకి రావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.
విద్యార్థులతో చెలగాటం..
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినప్పటికీ యూడైస్ నిబంధనలు ప్రకారంపేర్లు నమోదు కాకపోతే, వారు విద్యాశాఖ లెక్కలోకి రారని, ఆ విద్యార్థులకు హాల్ టికెట్లు రావని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని వేల్పుల సత్యనారాయణ నగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతులు లేకుండా కొనసాగుతోంది. ఇందులో పదో తరగతి విద్యార్థులు సుమారు 29 మంది చదువుతున్నారు. అయితే నవంబర్‌లో యూడైస్‌లో వివరాలు కనిపించకపోవడంతో ఆ విద్యార్థులందరూ టీసీలు తీసుకొని అనుమతులు ఉన్న మరో పాఠశాలలో అడ్మిషన్లు తీసుకున్నట్లు తెలిసింది. ఆ పాఠశాలలో ఇప్పటికే 130 విద్యార్థులు చదువుతున్నారని, అడిషనల్ సెక్షన్ అనుమతి లేదని తెలిసింది. అలాగే ముత్యాలమ్మ గూడెం, కృష్ణకాలనీలో అడిషనల్ సెక్షన్‌కు అనుమతులు లేని మరో రెండు పాఠశాలల్లో 230మందికి పైగా పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారని సమాచారం. ఇలా అనుమతులు లేని పాఠశాల, అడిషనల్ సెక్షన్‌కు అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారని, విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ స్కూళ్లు
విద్యార్థుల జీవితాలతో యాజమాన్యాల చెలగాటం
యూడైస్‌లో వివరాలు కనిపించకపోవడంతో మరో స్కూల్‌లో చేరిన విద్యార్థులు
మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు
యూడైస్ ప్రమాణికం..
ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడైస్)లో ప్రతీ విద్యార్థి సమగ్ర వివరాలు చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థి ఎక్కడ చదివింది.. వారి టీసీల వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. కాగా యూడైస్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన వివరాలు యూడైస్‌లో లేకుంటే వార్షిక పరీక్షల ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.


