గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి మైసమ్మ చెరువులో పడి గల్లంతైన విద్యార్థి భూక్య సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. ఈనెల 6వ తేదీ ఉదయం మైసమ్మ చెరువులో ఈతకెళ్లి సాయికిరణ్ గల్లంతైన విషయం తెలిసిందే. కాగా, విద్యార్థి గల్లంతైన సమయంలో అతడితోపాటు వచ్చిన విద్యార్థుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రూరల్ సీఐ సర్వయ్య ఎస్సైలు దీపిక, రవికిరణ్, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు శని, ఆదివారాల్లో 48 గంటల పాటు విద్యార్థి మృతదేహం కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాక వారితోపాటు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మర గాలింపు చేపట్టగా సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించా రు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించా రు. కాగా, ఎన్నో ఆశలతో సాగాల్సిన సాయికిరణ్ జీవితం అర్ధంతరంగా ఆవిరైపోయిందని తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.


