అంధులకు ప్రత్యేక సౌకర్యాలు
జనగామ: పోలింగ్ కేంద్రాల్లో అంధులు, ఆశక్తులైన ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అంధత్వం లేదా శారీరక బలహీనతల కారణంగా స్వయంగా బ్యాలెట్ పేపర్‌పై గుర్తు చేయలేని ఓటర్లు, 18 ఏళ్లకు తక్కువ కాకుండా ఉన్న ఒక సహచరుడిని ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే, అదే వ్యక్తి ఒకే రోజు, మరెక్కడా ఏ ఇతర ఓటరుకు సహచరుడిగా ఉండకూడదు. సహచరుడు వేసి ఓటుకు సంబంధించి రహస్యంగా ఉంచుతామని నమూనా–22 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. అన్ని కేసుల వివరాలు నమూనా–23లో నమోదు చేసి రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుంది. కంటి చూపు బలహీనంగా ఉన్న ఓటర్లు స్వయంగా గుర్తు చేయగలరా అనే అంశాన్ని పోలింగ్ సిబ్బంది ప్రశ్నించొచ్చు. కానీ, పోలింగ్ సిబ్బందే సహచరులుగా వ్యవహరించొద్దు. బ్రెయిలీ బ్యాలెట్ పేపర్ అందుబాటులో ఉన్న పోలింగ్ స్టేషన్లలో సహచరుడికి అనుమతి ఉండదు.
జనగామ: ఎన్నికల నిర్వహణ నియమావళి–2018లోని 25 (2)వ నియమం ప్రకారం ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వినియోగించేకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది తమ సొంత గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో పనిచేయలేని సమయంలో ఫారం–15 (అనుబంధం 21) ద్వారా సాధారణ పోలింగ్ స్టేషన్‌లోనే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందిన పక్షంలో (అనుబంధం 22) ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం జారీచేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రంపై సంతకం తీసుకొని, ఓ టర్ల జాబితా మార్కు చేసిన కాపీలో వారి పేరు ఉంటే సాధారణ ఓటరు తరహాలోనే ఓటు వేయడానికి అనుమతిస్తారు. అంతేకాకకుండా అన్ని పోలింగ్ కేంద్రాల సిబ్బంది ఈడీసీ కాకుండా పోస్టల్ బ్యాలెట్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. తమ సొంత మండలంలోనే విధులు నిర్వర్తించాల్సి వచ్చినా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడంపై ఎలాంటి అభ్యంతరం ఉండదని ఎన్నికల శాఖ తెలిపింది.
జనగామ: పోలింగ్ ప్రారంభం ఆలస్యమైనా, నిర్ణీత సమయానికే పోలింగ్ ముగించాలి. అయితే ముగింపు సమయానికి కేంద్రం వద్ద ఉన్న ఓటర్లందరికీ ఓటు వేయడానికి అనుమతి ఇవ్వాలి. ముగింపు సమయానికి కొద్ది నిమిషాల ముందు క్యూలో ఉన్నవారికి ఈ సమాచారాన్ని తెలియజేయాలి. క్యూలో చివరి వ్యక్తి నుంచి మొదలుకొని వరుస సంఖ్యలతో స్లిప్పులు పంపిణీ చేసి, వారు ఓటు వేసేంత వరకు పోలింగ్ కొనసాగించాలి. ముగింపు సమయం అనంతరం కొత్తగా ఎవరూ క్యూలో చేరకుండా పోలీసు, ఎలక్షన్ సిబ్బంది పర్యవేక్షణ చేయాలి. నిర్ణీత ముగింపు సమయం తర్వాత క్యూలో ఉన్న వారంతా ఓటు వేసిన వెంటనే పోలింగ్ ముగిసినట్లు ప్రకటించాలి. ఆ ప్రకటన తర్వాత ఎవరిని ఓటు వేయనియొద్దు.


