ఏం పార్టీలో.. ఏం పొత్తులో!
గీసుకొండ : నేను ఓ సామన్య ఓటరును. నా మైండ్ బ్లాకై పోతాంది.. మా గ్రామాలల్ల పంచాయతీ ఎన్నికలను జూస్తే ఇదేందిరా అనిపిత్తాంది.. మొన్నటిదాకా కత్తులు దూసుకున్నోళ్లు ఇప్పుడు ఒక్కటైతాండ్లు. నాది బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కొండా కాంగ్రెస్ అని జండాలు బట్టుకుని ఊరేగినోళ్లు, కొట్లాటకు దిగినోల్లు .. పంచాయతీ ఎన్నికలల్ల అవన్నీ మర్చిపోయి అలాయ్‌బలాయ్ దీసుకుంటాండ్లు... కపట ప్రేమలను ఒలకబోస్తాండ్లు.. ఎవరితో ఎవరు పొత్తులు బెట్టుకుండాల్లో, కలుత్తాల్లో తెల్వక నా చిన్న మెదడు హీటెక్కుతాంది. మా మండలంల నేను ఓ ఊరికి బోతే అక్కడ బద్ధ శత్రువులైన పార్టీల వారు ఒక్కటై తమ వారిని గెలిపించాలని కోరుతాండ్లు. రోజూ కలిసి దావత్‌లు జేసుకుంటాండ్లు.. ఏం జేసినా గెలవాలన్నదే వారి ఆలోచన.. గా యాల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలల్ల గట్టిగ జండాలను బట్టుకున్న వారు సైతం ఎటో ఓ దిక్కి బెండ్ అవుతుతాండ్లు.. ఎవరితోనైనా ఎవరు కల్వవచ్చనే కొత్త నీతి సిద్ధాంతానికి పెద్దమనుషులై తాండ్లు వాళ్లు.. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌లు బద్ధ శత్రువులు.. అయితేనేం ఈ ఎన్నికల్ల వారు దోస్త్ కడుతాండ్లు..దోస్తరబిన్ అందమా.. అంటూ పాటలు పాడుతూ చిందులేత్తాండ్లు. ఎక్కడ ఎట్ల ఉంటే అట్ల వారు పొత్తులు కడుతాండ్లు.. వారి పొత్తులను జూసి మావాళ్లు పరేషాన్ అయితాండ్లు.. రాజకీయమంటే గింత ఉంటదా అని మదన పడుతాండ్లు. మా ఊర్లె అయితే జనం ఎవరికి ఓటు ఏయాలనో తెల్వక పరేషాన్ అయితాండ్లు. నా పరిస్థితి గూడా అంతే.. ఓటేద్దామంటే నాకు ఇట్టంలేని పొత్తులు.. పోనీ ఓటేయకుండా పోదామంటే ఎందుకో నాకు మనసొప్పడం లేదు. పొత్తులతో నా ఇష్టాన్ని హైజాక్ జేసిండ్లు ఆ ‘పొత్తల’ పార్టీలోల్లు..నా లాంటి ఓటరు పరిస్థితి పగోడికి కూడా రావొద్దు దేవుడా..! నా ఇష్టం వచ్చినోళ్లుకు ఓటేయలేక పోతున్న.. మీ గొప్ప మనసుతో నన్ను క్షమించు..నాకేమైనా దారిజూపు..
జీపీ ఎన్నికల్లో పార్టీల పొత్తుపై ఓటరు ఆశ్చర్యం


