రెండు రంగుల్లో బ్యాలెట్..
భూపాలపల్లి అర్బన్ : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈవీఎంలు వినియోగిస్తారు. అయితే త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఒక్కో పంచాయతీలో ఓటరు ఒకటి సర్పంచ్‌కు, మరొకటి వార్డు సభ్యుడికి.. ఇలా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఓటర్లకు అందజేసే బ్యాలెట్ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగులో ఉంటాయి. బ్యాలెట్ పత్రాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే కనిపిస్తాయి. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. బ్యాలెట్ పత్రం చివరలో నోటా గుర్తు ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ చివరిలో నోటాను వినియోగిస్తున్నారు. పైఅభ్యర్థులు నచ్చకపోతే ఓటరు నోటాకు ఓటు వేయొచ్చు. ఒక్క బ్యాలెట్ పేపర్‌లో ఎనిమిది గుర్తులతో పాటు చివరలో నోటా గుర్తుకు స్థానం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సంఖ్య దాటితే మరో బ్యాలెట్ పేపర్ జతచేస్తారు. అంటే ఎక్కడైనా ఎనిమిది మందికి మించి బరిలో ఉంటే అదనపు బ్యాలెట్ వినియోగిస్తారు. కాగా, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సంబంధిత సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కేంద్రంలో ఒక్కో వార్డు బ్యాలెట్ బాక్సును వరుసగా తెరుస్తారు. ముందు వార్డు సభ్యుల ఓట్లు లెక్కిస్తారు. ఒకవేళ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు.
సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ
వార్డు సభ్యులకు తెలుపు..
ఉండని అభ్యర్థుల పేర్లు
బ్యాలెట్ పత్రం చివరన నోటా


