వరంగల్‌లో 22.45 శాతం డ్రాపౌట్స్!
● కాకతీయ వర్సిటీ, రెండు కళాశాలల
అభివృద్ధికి రూ. 56 కోట్లు..
● లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ
కావ్య ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్ జిల్లాలో సెకండరీ విద్య స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ (బడి మానేయడం) రేటు ఆందోళనకరంగా ఉందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఏకంగా 22.45 శాతం డ్రాపౌట్ రేటు నమోదైనట్లు సోమవారం లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేంద్రం పలు నిధులను మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీతో పాటు హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ, వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కలిపి పీఎం ఉషా కింద మొత్తం రూ.56 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ – క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్’ కింద కాకతీయ వర్సిటీలో పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు రూ. 50 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. పీఎం అజయ్ పథకం కింద కాకతీయ వర్సిటీలో ఒక బాలుర (150 సామర్థ్యం), ఒక బాలికల (300 సామర్థ్యం) హాస్టల్ నిర్మాణానికి రూ. 9 కోట్లు మంజూరయ్యాయి. అంతేగాక జాతీయ విద్యా విధానం2020 అమలులో భాగంగా వరంగల్ జిల్లా నుంచి 16 పాఠశాలలను ‘పీఎం శ్రీ’ పథకం కింద అప్‌గ్రేడ్ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.


