పైసలిస్తేనే పనులు! | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే పనులు!

Dec 8 2025 7:44 AM | Updated on Dec 8 2025 7:44 AM

పైసలిస్తేనే పనులు!

పైసలిస్తేనే పనులు!

ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో రాజ్యమేలుతున్న అవినీతి టీసీ బుక్స్‌కూ పైసలు..

ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి వసూళ్లు..

ఎఫ్‌ఏసీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన 35 రోజులకే..

ప్రైవేట్‌ స్కూళ్ల రెన్యువల్‌, కొత్త స్కూళ్ల అనుమతికి భారీగా వసూళ్లు

తాజాగా ఏసీబీకి చిక్కిన హనుమకొండ ఇన్‌చార్జ్‌ డీఈఓ, ఇద్దరు ఉద్యోగులు

విద్యారణ్యపురి: ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో అవినీతి భూతం రాజ్య మేలుతోంది. ఏ పనికావాలన్నా పైసలు ముట్టజెప్పాల్సిందే. అవినీ తి ఆరోపణల నేపథ్యంలో గతంలో డీఈఓలుగా పనిచేసిన పలు వురిని విద్యాశాఖ బదిలీ చేయడంతోపాటు బాధ్యతల నుంచి తప్పించింది. ఒకరిద్దరు మాత్రం వారికివారే తప్పుకున్నారు. హనుమకొండ డీఈఓగా పనిచేసిన వాసంతిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుల నేపథ్యంలో ఆమెను డీఈఓ బాధ్యతల నుంచి తప్పించగా సెలవుపై వెళ్లారు. అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డికి ఎఫ్‌ఏసీ డీఈఓగా బాధ్యతలు అప్పగించారు.

రెగ్యులర్‌ డీఈఓలు లేక.. విద్యాశాఖ డీలా

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విద్యాశాఖ గాడి తప్పింది. రెగ్యులర్‌ డీఈఓలు లేక డీలా పడింది. ములుగు జిల్లాలో కొంతకాలం క్రితం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) ఇన్‌చార్జ్‌ డీఈఓగా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వరంగల్‌ జిల్లాలో ఏడీ అధికారికే డీఈఓ బాధ్యతలు అప్పగించగా.. అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు వేరే జిల్లాకు బదిలీ చేశారు. హనుమకొండ జిల్లాలో గత డీఈఓను విధులనుంచి తప్పించి అదనపు కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించినా అదే పరిస్థితి దాపురించింది. డీఈఓ కార్యాలయానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చివెళ్లేవారు. ఎక్కువ ఫైళ్లను కలెక్టరేట్‌లోని తన చాంబర్‌కు సిబ్బంది తీసుకెళ్తే సంతకాలు చేసేవారు. దీంతో డీఈఓ కార్యాలయంలో పర్యవేక్షణ కొరవడింది. పలు సెక్షన్లలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

గతంలో టీసీ బుక్స్‌ ఇస్తే సెక్షన్‌లో ఉండే సిబ్బంది ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వసూలు చేసేవారు. దీంతో ఫిర్యాదు రాగా అక్కడ సెక్షన్‌లో పనిచేసే ఉద్యోగిని తప్పించి టీసీ బుక్స్‌ ఇచ్చే బాధ్యతలు అప్పటి డీఈఓ అబ్దుల్‌హై హయాంలో డీసీఈబీకి అప్పగించారు. అప్పటి నుంచి డబ్బులు వసూలు చేయకుండా నిబంధనల ప్రకారమే టీసీ బుక్స్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలకు ఇస్తున్నారు. అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించాక టీసీ బుక్స్‌ మళ్లీ డీఈఓ కార్యాలయంలో సంబంధిత సెక్షన్‌కే అప్పగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. టీసీ బుక్స్‌కు కూడా డబ్బులు వసులు చేసేందుకే సెక్షన్‌ సిబ్బంది చక్రం తిప్పి డీఈఓతో ఉత్తర్వులు జారీ చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.

హనుమకొండ జిల్లాలో 200కుపైగా ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి పాఠశాలలు డీఈఓ పరిధిలో, 6 నుంచి 10వ తరగతివరకు పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ పరిధిలో అనుమతులు రెన్యువల్‌ చేస్తారు. అయితే, హైస్కూళ్లు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవాలి. గతంలో ఒక స్కూల్‌లో ఒకటి నుంచి 5 తరగతుల వరకు డీఈఓ అనుమతి, రెన్యువల్‌ చేస్తే సంబంధిత సెక్షన్‌లో రూ.30 వేల వరకు వసూలు చేశారనేది ఆరోపణలున్నాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు డీఈఓ రెన్యువల్‌, అనుమతి ఇచ్చాక.. 6 నుంచి 10 వతరగతి వరకు అనుమతికి పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీకి కూడా రెకమెండ్‌ చేయా లి. ఒక కాపీని ఆర్‌జేడీ కార్యాలయానికి పంపుతారు. గత డీఈఓ హయాంలో కార్యాలయ సెక్షన్‌లో రూ.60 వేల వరకు వసూలు చేశారని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ బాధ్యులు పేర్కొన్నారు. కొత్తగా ప్రైవేట్‌ పాఠశాలల అనుమతికి రూ.లక్షకుపైగానే సెక్షన్‌ సిబ్బంది వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. రెన్యువల్‌ ఫీజుగా ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించేది రూ.5వేలు మాత్రమే. డీఈఓ కార్యాలయ సెక్షన్‌లో మాతం రూ.60 వేలు ఇవ్వాల్సి రావడంతో యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. నూతన పాఠశాలల అనుమతికి ప్రభుత్వానికి చలాన్‌ రూ పంలో రూ.10 వేలు మాత్రమే చెల్లించాలి.

హనుమకొండ కొత్తూరు జెండాలోని క్రియేటివ్‌ మోడల్‌ హైస్కూల్‌ 10 సంవత్సరాల రెన్యువల్‌కు డీఈఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ గౌస్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ మనోజ్‌ రూ.లక్ష డిమాండ్‌ చేశారు. శుక్రవారం రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వీరు అధికారులకు పట్టుబడ్డారు. వీరితోపాటు ఇన్‌చార్జ్‌ డీఈఓ ఎ.వెంకటరెడ్డిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఎఫ్‌ఏసీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన 35 రోజులకే వెంకటరెడ్డి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడడం కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement