అందని అల్పాహారం
మహబూబాబాద్ అర్బన్: ప్రతీ విద్యార్థికి 10వ తరగతి అనేది చాలా కీలకం. ఇక్కడ సాధించిన ఫలితాల ఆధారంగా భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవచ్చు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందడం లేదు. దీంతో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అల్పాహారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
గతంలో అందజేత..
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా గతంలో విద్యార్థులకు సాయంత్రం అల్పాహారంలో ఒక బిస్కెట్ ప్యాకెట్, 50గ్రాముల గుడాలు, శనిగలు, ఉడకబెట్టిన పల్లీలు, కొబ్బరి గుడాలు, అటుకులు వంటి స్నాక్స్ ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం పూర్తిగా విస్మరించింది.
ఉత్తీర్ణతశాతం పెరిగేలా..
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. గత నెల నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ తరగతులతో పాటు ఉదయం, సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.15 గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4.45గంటల నుంచి 5.45గంటల వరకు ప్రత్యేక తరగతులు జరుగుతున్నారు. మార్చి 18నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని మొత్తం 100 ప్రభుత్వ పాఠశాలల్లో 4,501 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. అయితే సాయంత్రం అల్పాహారం లేకపోవడంతో పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది.
ఉదయం ఖాళీ కడుపుతో..
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేవారిలో ఎక్కువ శాతం పేద విద్యార్థులే ఉంటారు. చలికాలం కావడంతో ఉదయం ఇళ్లలో ఆహారం తీసుకోకుండానే పాఠశాలలకు వస్తున్నారు. ఇలా చాలామంది విద్యార్థులు ఖాళీ కడుపుతో ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనం ఎప్పుడు పెడుతారని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోతే అంతే సంగతులు. సాయంత్రం ఇంటికి వెళ్లేవరకు అకలితో అలమటించాల్సి పరిస్థితి ఉంది. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు అల్పాహారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం అందని స్నాక్స్
10వ తరగతి విద్యార్థులకు
తప్పని పస్తులు
అల్పాహారం అమలు చేయాలని
తల్లిదండ్రుల వేడుకోలు


