ఎస్పీ ఆకస్మిక తనిఖీ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లోని ఒకటి, రెండు ప్లాట్ ఫారాలు, జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఎస్పీ శబరీష్ శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు, ప్రజల రక్షణ కోసం చేపట్టిన బందోబస్తు చర్యలపై ఆరా తీశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకుగాను విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
సేవా కార్యక్రమాలకు చేయూతనందించాలి
తొర్రూరు: సేవా కార్యక్రమాలకు చేయూతనందించాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి మేడిశెట్టి రామకృష్ణ అన్నారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలో సేవా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన క్లబ్ ప్రతినిధులకు పురస్కారాలు ప్రదానం చేశారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఆర్యవైశ్యులు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు కల్వ హరికృష్ణ, చిదిరాల నవీన్‌కుమార్, గౌరీ శంకర్, వజినపల్లి అనిల్‌కుమార్, లింగమూర్తి, రామ్మూర్తి, రామా ఉపేందర్, ఇమ్మడి రాంబాబు, బిజ్జాల వెంకటరమణ, రాము, రవి తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు
భంగం కలిగించొద్దు
పెద్దవంగర: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, ప్రతీ ఒక్కరు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాల్లో గొడవలు, గుంపులు, తగాదాలు, ఉద్రిక్తతలకు దారితీస్తే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పుకార్లు, నిర్ధారణలేని వార్తలు ప్రచారం చేయవద్దన్నారు. ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అన్ని పార్టీల నాయకులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ గణేశ్, ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్, ఏఎస్సై హిదాయాలి, పోలీస్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చా రు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. కోళ్లు, యాటలను అమ్మవార్లకు జడతపట్టి మొక్కుగా సమర్పించారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం, చిలకలగుట్ట, శివరాంసాగర్ పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దీంతో మేడారం పరిసరాల్లో ఎటు చూసినా భక్తులే కనిపించారు.
ఎస్పీ ఆకస్మిక తనిఖీ
ఎస్పీ ఆకస్మిక తనిఖీ
ఎస్పీ ఆకస్మిక తనిఖీ


