దళారుల దందా!
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ బయట, పలు దుకాణాలు, మిల్లుల వద్ద కొందరు వ్యాపారులు ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు. క్యాష్ కటింగ్, తరుగు తీస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చిల్లర కొనుగోళ్ల వల్ల కేసముద్రం మార్కెట్ ఆదాయానికి గండి పడుతోంది. ఏటా సీజన్‌లో చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. అయితే ధాన్యం ట్రాక్టర్లను మార్కెట్ బయట ఉన్న ట్రేడింగ్ దుకాణాలు, మిల్లుల వద్ద ఆపి, మార్కెట్‌కు వెళ్తే పడిగాపులు పడాల్సి వస్తుందని, అదే తామైతే వెంటనే కొనుగోలు చేస్తామని, నగదు చెల్లిస్తామని చెబుతూ ఖరీదు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది రైతులు డబ్బులు అవసరం ఉండడంతో బయట వ్యాపారులను ఆశ్రయిస్తూ వారు నిర్ణయించిన ధరలకే అమ్ముకుని మోసపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామంటే బోనస్ పడడం లేదనే ఆందోళనతో పలువురు రైతులు తమ అవసరాల నిమిత్తం దుకాణాలు, మిల్లులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు.
దోపిడీ సాగేది ఇలా..
మహముద్‌పట్నం శివారు తావుర్యాతండా మూలమలుపు వద్ద కొందరు వ్యక్తులు ధాన్యం లోడ్ ట్రాక్టర్లను ఆపి, అక్కడే రేటు నిర్ణయించి, కేసముద్రంలోని సదరు వ్యాపారి దుకాణం, మిల్లుల వద్దకు రైతులను పంపుతున్నారు. తీరా అక్కడి వెళ్తే తేమ సాకును చూపుతూ క్వింటాకు రూ.100 నుంచి రూ.200 చొప్పు ధర తగ్గిస్తున్నారు. అలాగే 30కిలోల తరుగు తీస్తున్నారు. అలాగే వేబ్రిడ్జి కాంటా పెట్టినప్పటికీ కూలీ, హమాలీ పేరిట బస్తాకు(65 కేజీలు) రూ.16నుంచి రూ.20 వరకు కట్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యాపారి దడవాయిలకు మాత్రం బస్తాకు రూ.3ల చొప్పునే చెల్లించడం గమనార్హం. కాగా, మార్కెట్ బయట ధాన్యం ఖరీదు వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామంటూ మార్కెట్‌లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బయట కొనుగోళ్లు జరపడం వల్ల మార్కెట్‌కు ఫీజు రూపంలో వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. ఇదిలా ఉండగా కొందరు వ్యాపారులు ట్రాక్టర్ డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుని, ధాన్యం లోడ్ తీసుకువస్తే రూ.200చొప్పున డ్రైవర్లకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని రకాలుగా వ్యాపారుల చేతుల్లో రైతులు మోసపోవాల్సి వస్తోంది. ఇప్పటికై నా మార్కెట్ అధికారులు స్పందించి, రైతులను మోసగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వాయిదా పద్ధతుల్లో చెల్లింపులు..
ధాన్యాన్ని ఖరీదు చేసిన రోజు డేట్ వేసిన చెక్కునే రైతులకు ఇవ్వాల్సి ఉండగా, వారం నుంచి 15 రోజుల గడువుతో చెక్కుపై డేట్ వేసి వ్యాపారులు ఇస్తున్నారు. దీంతో బ్యాంకుల చుట్టూ తిరగలేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇది వరకు నగదు చెల్లిస్తే ఒకశాతం క్యాష్ కట్‌చేసి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు వాయిదా పద్ధతుల్లో చెక్కులు, రశీదులను ఇవ్వడమే కాకుండా, ఒకశాతం క్యాష్ కటింగ్ పెడుతున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ బయట దోపిడీకి
గురవుతున్న రైతులు
తరుగు పేరిట ట్రాక్టర్‌కు 30కేజీల కోత
క్యాష్ కటింగ్ చేస్తూ వాయిదా
పద్ధతిలో చెక్కులు
కేసముద్రం మార్కెట్ ఆదాయానికి గండి
దళారుల దందా!


