వాహనాల కొరత..
● అరకొరగా చెత్త సేకరణ
● మరమ్మతులకు గురై
మూలన పడిన వాహనాలు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ అరకొరగా సాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల మరమ్మతులు, పారిశుద్య సిబ్బంది, డ్రైవర్ల కొరతతో చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో ఇళ్లతో పాటు వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. దీంతో పలు వార్డుల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిబ్బంది కొరత..
మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులు ఉండగా.. వార్డుకు ఇద్దరు చొప్పున పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉండగా వార్డుల వారీగా చెత్తసేకరణ సక్రమంగా జరగడం లేదు. ప్రతీరోజు మెయిన్ రోడ్డును శుభ్రపరుస్తూ వార్డులను పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాలుగు రోజులకోసారి వీధులను శుభ్రపరిచే సిబ్బంది ప్రస్తుతం పది రోజులకు కూడా వార్డుల ముఖం చూడడం లేదని స్థానికులు చెబుతున్నారు.
మూలనపడిన వాహనాలు..
మున్సిపాలిటీలో చెత్త సేకరణ కోసం మూడు ట్రాక్టర్లు, మూడు ఆటోలను కొనుగోలు చేశారు. కొంతకాలం నడిచిన వాహనాలు తర్వాత తరచూ మరమ్మతులకు గురయ్యాయి. ప్రస్తుతం ఓ ట్రాక్టర్, ఓ ఆటోతో మాత్రమే చెత్త సేకరిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు డ్రైవర్లు ఉండగా వాహనాలు లేక ఖాళీగా ఉండే డ్రైవర్లు చెత్త సేకరణ విధులు నిర్వహిస్తున్నారు.
కార్యాలయానికే పరిమితం..
సుమారు నెలరోజల క్రితం చెత్త సేకరణ కోసం రెండు ఆటోలను కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ చేతుల మీదుగా ఆటోలను ప్రారంభించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఆయన సమయం కోసం ఎరుదుచూస్తుండడతో ఆటోలు నెల రోజులుగా కార్యాలయానికే పరిమితమయ్యాయి. వాహనాల కొరతతో వీధులు, ఇళ్లలో చెత్త పేరుకుపోతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త సేకరణ సక్రమంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


