చాలెంజ్ ఓటు అంటే ఏమిటి?
జనగామ: ఓటరు గుర్తింపుపై పోలింగ్ ఏజెంట్‌కు అనుమానం కలిగితే ఎన్నికల నిబంధనల మేరకు చాలెంజ్ చేయొచ్చు. సంబంధిత వ్యక్తి అసలు ఓటరే కాదని చాలెంజ్ చేస్తూ ప్రిసైడింగ్ అధికారికి రూ.5 రుసుము చెల్లించాలి. వెంటనే ప్రిసైడింగ్ అధికారి విచారణ ప్రారంభిస్తారు. ముందుగా చాలెంజ్ చేసిన ఏజెంట్ నుంచి సాక్ష్యాలు సేకరిస్తారు. సరైన ఆధారాలు లేకపోతే వెంటనే చాలెంజ్ తిరస్కరిస్తారు. ఆధారాలు ఉంటే తాను నిజమైన ఓటరేనని నిరూపించుకునే అవకాశం ఆ వ్యక్తికి ఇస్తారు. అవసరమైతే గ్రామ అధికారి, క్యూలో ఉన్న ఇతర ఓటర్లను కూడా ప్రశ్నిస్తారు. చాలెంజ్ తప్పని తేలితే ఆ వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వడంతోపాటు రూ.5 తిరిగి ఇస్తారు. చాలెంజ్ నిజమని తేలితే సదరు వ్యక్తిని ఓటు వేయనివ్వరు. అనుబంధం–13 ప్రకారం ఫిర్యాదు రాసి పోలీసులకు అప్పగిస్తారు. ఈ సందర్భంలో చాలెంజ్ రుసుము ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. అన్ని వివరాలు ఫారం–21 (అనుబంధం–14)లో రికార్డు చేస్తారు. చాలెంజ్ ఫీజు రశీదు అనుబంధం–15 ప్రకారం జారీ అవుతుంది. ఓటరు గుర్తింపుపై అనుమానం వచ్చినప్పుడు ప్రిసైడింగ్ అధికారి తీసుకునే వేగవంతమైన చర్య. ఇదేం పోలింగ్‌ను పారదర్శకంగా ఉంచే కీలక ప్రక్రియ.
నిష్పక్షపాత ఎన్నికలు ఇలా?
జనగామ: స్వేచ్ఛాపరమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ ప్రారంభానికి ముందు బ్యాలెట్ బాక్సుల ప్రదర్శన, మార్క్‌డ్ ఓటరు జాబితా సిద్ధం, ఆకుపచ్చ పేపర్ సీల్‌పై అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సంతకాల స్వీకరణ తప్పనిసరిగా చేపట్టాలని సూచించింది. 12వ అనుబంధం భాగం–1 ప్రకటనను పోలింగ్ స్టేషన్‌లో అందరూ వినేలా గట్టిగా చదవడంతోపాటు సంతకం చేసిన, చేయని ఏజెంట్ల రికార్డును నమోదు చేయాల్సి ఉంటుంది. పోలింగ్ సమయంలో అదనపు బ్యాలెట్ బాక్సులు అవసరమైతే ప్రతీసారి కొత్త బాక్సును ప్రారంభించే ముందు 12వ అనుబంధం భాగం–2 ప్రకటన చదవాలి. పోలింగ్ ముగిసిన వెంటనే భాగం–3 ప్రకటన నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. అన్ని డిక్లరేషన్లు, బ్యాలెట్ పేపర్ అకౌంట్, పేపర్ సీల్ అకౌంట్, ప్రిసైడింగ్ అధికారి డైరీతో సహా ప్రత్యేక ప్యాకెట్‌లో రిటర్నింగ్ అధికారికి పంపాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
అందరి ఇంటిపేరు ఒక్కటే!
● సర్పంచ్‌గా పోటీ చేసే
నలుగురూ దగ్గరి బంధువులే
గీసుకొండ : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలోని హర్జ్యతండాలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. గ్రామ సర్పంచ్ పదవికి నలుగురు పోటీ చేస్తుండగా వారందరి ఇంటిపేర్లు ఒకే విధంగా ఉన్నాయి. ఆంగోతు ప్రశాంత్, ఆంగోతు మహబూబ్‌నాయక్, ఆంగోతు మాను, ఆంగోతు వీరయ్య.. ఇలా వారంతా దగ్గరి బంధువులే. అన్నదమ్ముల వరస వారే అని తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీలో 374 మంది ఓటర్లే ఉండటం విశేషం. ఈ నెల 14న గ్రామంలో ఎన్నికలు జరుగనున్నాయి.
చాలెంజ్ ఓటు అంటే ఏమిటి?


