మెడికల్ షాపులో చోరీ..
● రూ. 56 వేల నగదు ఆపహరణ
ఖిలా వరంగల్: మెడికల్ షాపులో చోరీ జరిగింది. ఈ ఘటన ఉర్సు కరీమాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉర్సు కరీమాబాద్‌కు చెందిన బలభధ్ర దినేష్ అదే ఏరియాలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి షాపునకు తాళం వేసి ఇంటికెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున దుండగులు తాళం ధ్వంసం చేసి షాపులోకి చొరబడి క్యాష్ కౌంటర్‌లోని సుమారు రూ.56 వేల నగదు అపహరించారు. ఉదయం పక్కింటి వారు గమనించి దినేష్‌కు సమాచారం అందజేయగా ఆయన హుటాహుటిన షాపుకు వెళ్లి చూడగా కౌంటర్‌లోని నగదు కనిపించలేదు. దీంతో మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్, క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బాధితుడు దినేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


