కేయూలో నోబెల్ ప్రైజ్‌డే ఉత్సవాలు
కేయూ క్యాంపస్: పరిశోధన, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు కాతీయ యూనివర్సిటీలో ఈనెల 9, 10 తేదీల్లో నోబెల్ ప్రైజ్‌డే ఉత్సవాలను నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ విభాగం బాధ్యులు ఈ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
326 మంది రిజిస్ట్రేషన్..
నోబుల్ ప్రైజ్‌డే ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 9న వివిధ విభాగాల విద్యార్థులకు పోస్టర్ ప్రజంటేషన్స్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనేందుకు ఆదివారం రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. లైఫ్ సైన్సెస్‌లో బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల నుంచి 165 మంది విద్యార్థులు, ఫార్మసీ కాలేజీ నుంచి 45 మంది, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్ విభాగాల నుంచి 61 మంది, కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్, మహిళా ఇంజనీరింగ్ కళాశాల నుంచి 41 మంది మొత్తం 326 మంది నమోదు చేసుకున్నారు.
పలు అంశాల్లో పోటీలు..
ఈనెల 9న పలు అంశాల్లో విద్యార్థులకు పోటీలు ఉంటాయి. కెమిస్ట్రీ విద్యార్థులకు శాస్త్రం, సమాజాన్ని మార్చిన నోబెల్ కెమిస్ట్రీ ఆవిష్కరణలు అనే అంశం, ఫిజిక్స్ విద్యార్థులకు నోబెల్ భౌతిక ఆవిష్కరణలు ఆధునిక ప్రపంచాన్ని ఎలా ఆవిష్కరించాయి అనే అంశంపై, లైఫ్ సైన్సెస్, ఫార్మసీ విద్యార్థులకు నోబెల్ ఆవిష్కరణలు మానవ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయి అనే అంశం, ఎకనామి క్స్ విద్యార్థులకు నోబెల్ ఆర్థికశాస్త్ర విజేతలు సమాజాన్ని ఎలా మార్చారు అనే అంశం, ఇంగ్లిష్ విభాగం విద్యార్థులకు సాహిత్యంలో నోబెల్ విజేతలు ప్రపంచాన్ని మార్చిన స్వరాలు అనే అంశాలపై పోస్టర్ల ప్రజంటేషన్లు, వక్తృత్వ పోటీలు ఉంటాయి.
పలు అంశాలపై సెమినార్లు..
నిర్దేశించిన విభాగాల్లో నోబెల్ బహుమతి లభించిన పరిశోధన అంశంపై ఈనెల 10న విషయ నిపుణులతో సెమినార్లు ఉంటాయి. ఆర్థికశాస్త్రంలో శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ మహ్మద్‌ఇక్బాల్, ఫిజిక్స్‌లో బిట్స్ ఫిలానీ నుంచి ప్రొఫెసర్ తనైనాగ్, లైఫ్ సైన్సెస్ విభాగాలకు వైద్యులు వలపుదాసు చంద్రశేఖర్, కెమిస్ట్రీ విభాగంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాసం చంద్రశేఖర్, ఆంగ్లంలో వరంగల్ నిట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా విశ్వనాథన్ ఈ సంవత్సరం నోబెల్ బహుమతులు పొందిన అంశాలపై ప్రసంగించనున్నారు.
9, 10 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు


