ఆటోలో వచ్చి.. అందినకాడికి ఎత్తుకెళ్లి..
మరిపెడ రూరల్: ఆటోలో వచ్చిన దుండగులు పట్టపగలే తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం, ఎల్లంపేట గ్రామాల్లో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. రాంపురం గ్రామానికి చెందిన బోర గంగమ్మ అనారోగ్యంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. ఆమె భర్త ముత్తయ్య ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాడు. ఈ క్ర మంలో ఓ మహిళతోపాటు నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని టిఫిన్ బాక్స్‌లో దాచిన సుమారు రూ.4.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు గంగమ్మ బోరున విలపించింది. అదేవిధంగా ఎల్లంపేట శివారులో ఉంటున్న అలువాల వెంకన్న డయాలసిస్ కోసం ఇంటికి తాళం వేసి ఖమ్మం ఆస్పత్రికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదు దోచుకెళ్లారు. ఈ రెండు గ్రామాల్లోని ఇళ్లల్లో చోరీ చేసింది ఒకే ఆటోలో వచ్చిన వారు ఒకరేనా..లేక వేరే వారా ఆయా గ్రామాస్తులు చర్చించుకుంటున్నారు. ఈ చోరీలపై మరిపెడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.
పలు గ్రామాల్లో పట్టపగలే తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ
బంగారు, వెండి ఆభరణాలు
అపహరించిన దుండగులు


