కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం చోరీ
మంగపేట: మండలంలోని బోరునర్సాపురంలోని మ్యాక్స్ ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద కాంటా పెట్టిన 61 బస్తాలను శనివారం రాత్రి దుండగులు ఎత్తికెళ్లినట్లు బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత రైతు తాండ్ర బక్కయ్య కథనం ప్రకారం.. గ్రామంలోని మ్యాక్స్ సెంటర్ నిర్వాహకులకు శనివారం సాయంత్రం కాంటా పెట్టిన 60 బస్తాలను లారీలో లోడింగ్ చేసేందుకు ఆదివారం ఉదయం వచ్చి చూడగా అందులో 40 బస్తాలు కనిపించలేదు. అదే విధంగా సమీపంలోని మరో మ్యాక్స్ సెంటర్ వద్ద మూతి రవి అనే రైతు కాంటా పెట్టిన 21 బస్తాలు కూడా కనిపించలేదు. ఈ ఘటనలపై బాధిత రైతులు సెంటర్ ఇన్‌చార్జ్ నవీన్‌రెడ్డితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వారం క్రితం గ్రామానికి చెందిన రైతు చిట్టిపోతుల నర్సయ్యకు చెందిన 11 బస్తాల ధాన్యం చోరీకి గురైనట్లు సమాచారం. రాజుపేటలో మరో రైతుకు చెందిన ధాన్యాన్ని గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఎత్తుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్లు తెలియడంతో బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం..
కొందరు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రాల వద్ద నిబంధనల మేరకు కనీస ఏర్పాట్లు చేయడం లేదన్నారు. సెంటర్ల వద్ద కాపలాదారులను నియమించక పోవడం, కాంటా పెట్టిన వెంటనే బస్తాలను పంపించకుండా రోజుల తరబడి కాలయాపన చేయడం కారణంగా చోరీలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
పోలీసులకు బాధిత రైతుల ఫిర్యాదు


