సనాతన ధర్మరక్షణకు కృషి చేయాలి
● త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి
హన్మకొండ కల్చరల్ : హిందూ సంస్కృతి,సంప్రదాయాలు, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని త్రిదండి చినజీయర్‌స్వామి ఉద్భోదించారు. శనివారం హనుమకొండలో చినజీయర్‌స్వామిని తెలంగాణ అర్చక, ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామికి పూలమాల, పండ్లు, తాంబూలం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చినజీయర్‌స్వామి మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి, వేదాలకు దేవాలయాలే నిలయమని, ఆగమానుసారం పూజలు జరిగేలా చూడాలన్నారు. నిత్య కై ంకర్యాల విషయంలో రాజీపడకుండా ముందుకు సాగాలన్నారు.
హోంగార్డుల సేవలు ప్రశంసనీయం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : శాంతిభద్రతల రక్షణలో హోంగార్డుల సేవలు ప్రశంసనీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శనివారం పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వరంగల్ సీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంగార్డులు నిర్వహించిన పరేడ్ ఆహ్వానితులతో పాటు పోలీసు అధికారులను ఆకట్టుకుంది. అనంతరం విధినిర్వహణలో ప్రతిభ చూపిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. క్రీడల్లో రాణించిన హోంగార్డులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతోందని తెలిపారు. ఇందులో భాగంగా అత్యధిక గౌరవ వేతనం అందించడంతోపాటు, ట్రాఫిక్ పోలీసులతో సమానంగా ఆ విభాగంలో విధులు నిర్వహించే హోంగార్డులకు 30శాతం అదనపు వేతనం, పరేడ్ అలవెన్స్ రూ.200కు పెంచిందన్నారు. హోంగార్డులకు ఉచిత వైద్య సదుపాయం కల్పనకోసం ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. డీసీపీలు అంకిత్ కుమార్, కవిత, అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌స్సైలు, సిబ్బంది, హోంగార్డుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సనాతన ధర్మరక్షణకు కృషి చేయాలి


