ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ఓటర్లు బాధ్యతగా ఓటు వేయాలి
● ప్రజల్లో అవగాహన.. ప్రతీరోజు గస్తీ
● సాక్షి ఇంటర్వ్యూలో ఎస్పీ శబరీశ్
● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
● పాతనేరస్తుల బైండోవర్, ఆయుధాల స్వాధీనం
ఎస్పీ శబరీశ్
సాక్షి, మహబూబాబాద్:
ఎన్నికలు అంటేనే పార్టీలు, వ్యక్తుల మధ్య మాట యుద్ధం.. ఇక పంచాయతీ ఎన్నికలు నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతాయి. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. ఇక ప్రచారం.. ఓటింగ్.. ఫలితాలే తరువాయి. కాగా.. స్థానిక పోరులో బిజీగా మారిన గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పిస్తున్నామంటున్న ఎస్పీ శబరీశ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
సాక్షి: జిల్లాకు కొత్తగా వచ్చిన మీకు వెంటనే ఎన్నికల నిర్వాహణ పరీక్షగా మారింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు..?
ఎస్పీ: నేను జిల్లాకు కొత్త కావచ్చు.. కానీ మా డిపార్టుమెంట్‌లో డీఎస్పీ నుంచి హోంగార్డు వరకు పాతవారే ఉన్నారు. వారి సహకారంతో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. గ్రామ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం. వారి ద్వారా సమస్యలను తెలుసుకొని శాంతియుత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
సాక్షి: శాంతిభద్రతల సమస్య రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
ఎస్పీ: జిల్లా అంతా సమస్యలతో ఉంటుందని అనుకోవడం సరికాదు. గత ఎన్నికలు, గతంలో జరిగిన ఘటనలను పరిశీలించి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాం. ఇలా మొదటి విడతలో 155 గ్రామపంచాయతీలు, 1,338 వార్డులు ఉండగా.. 45 సమస్యాత్మక కేంద్రాలు, రెండో విడతలో 158 గ్రామపంచాయతీలు, 1,360 వార్డులు ఉండగా.. 37 సమస్యాత్మక కేంద్రాలు, మూడో విడతలో 169 గ్రామపంచాయతీలు, 1,412 వార్డుల ఉండగా.. 55 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించాం. ఆయా గ్రామాల్లో ప్రతీ రోజు గస్తీ నిర్వహిస్తున్నాం.
సాక్షి: గొడవలు జరగకుంగా ముందస్తుగా తీసుకున్న చర్యలు ఏమిటి..?
ఎస్పీ: ఎన్నికలు అంటే గొడవలు జరగడం సహజం అనే ధోరణి ఉంటుంది. కానీ, అసలు గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా ముందునుంచి ప్రణాళికతో వెళ్తున్నాం. ఇందుకోసం గ్రామాల్లో పోలీస్ కళాజాతా, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువను అర్థం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాం. 555 కేసులతో సంబంధం ఉన్న 2,889 మంది పాత నేరస్తులను బైండోవర్ చేసి.. వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలోని 15 లైసెన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గుండుబా తయారీపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటివరకు 36 (ఐడీ లిక్కర్) అక్రమ మద్యం కేసులు, 15 నల్లబెల్లం రవాణా కేసులు, 85 గుడుంబా కేసులు నమోదు చేశాం.
సాక్షి: బందోబస్తు ప్రణాళిక ఏమిటి.. ఎంత మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికలకు వినియోగిస్తున్నారు.
ఎస్పీ: జిల్లాలోని 482 పంచాయతీలు, 4,110 వార్డుల్లో ఒకేసారి కాకుండా విడత వారీగా ఎన్నికలు జరగడం మాకు కొంత ఉపశమనం. ఒక్కోవిడతకు ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహిస్తూ.. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు కాకుండా చూసేందుకు డీఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు మొత్తం 700 మంది స్థానిక పోలీసులు పనిచేస్తారు. వీరితోపాటు సీఆర్పీఎస్, ఎస్‌ఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాల సేవలు వినియోగించుకుంటాం.
సాక్షి: ప్రజలు, నాయకులకు పోలీస్ శాఖ ద్వారా చేసే సూచనలు ఏమిటి..?
ఎస్పీ: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం. ఈ విషయాన్ని ఓటర్లు, ప్రజా ప్రతినిధులు గమనించాలి. ఓటరు తనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేలా చూడాలి. ప్రలోభాలకు గురి చేయడం నేరం. ఐదు సంవత్సరాలు పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడంలో ఓటరు రాజీ పడొద్దు. అదే విధంగా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దు. పోటీలో ఉన్నవారిలో ఒకరు గెలుస్తారు.. మరొకరు ఓడుతారు.. ప్రజల తీర్పును అంగీకరించే మనస్తత్వం అలవర్చుకోవాలి. అంతే కానీ, కావాలని ప్రజలను రెచ్చగొట్టడం. అశాంతిని ప్రేరేపిస్తే సహించేది లేదు. కావున ఎన్నికలు సజావుగా జరగాలంటే పోలీసులు ఒక్కరి బాధ్యతే కాకుండా ప్రజలు, రాజకీయ పక్షాల నాయకుల సహకారం అవసరం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరిస్తారనే నమ్మకం ఉంది.
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


