ఎన్నికల బరిలో ఇరిగేషన్ ఈఈ సతీమణి
మరిపెడ రూరల్: మండలంలోని మూలమర్రితండా గ్రామ పంచాయతీకి చెందిన ఇరిగేషన్ ఈఈ భూక్య రాములునాయక్ సతీమణి జానకి అదేతండా జీపీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. శుక్రవారం ఆమె కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉద్యోగ రీత్యా కొంతకాలంగా పట్టణ ప్రాంతంలో స్థిరపడ్డప్పటికీ సొంత ఊరికి మంచి చేయాలన్న సంకల్పంతో ఇటీవల కుటుంబంతో సహా స్వగ్రామానికి వచ్చారు.
బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాంగ్రెస్‌లోకి..
బయ్యారం: మండలంలోని కొత్తపేట సర్పంచ్ స్థానానికి బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా గుగులోత్ శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నామినేషన్ల ఉపసంహరణ రోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో కొత్తపేట పంచాయతీలో బీజేపీ తరఫున బలపర్చిన అభ్యర్థి పోటీ లేకుండాపోగా కాంగ్రెస్‌లో హర్షం వ్యక్తం అవుతుంది.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అప్రంటిషిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సీహెచ్. మదార్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టీ కోర్సులు, పదో తరగతి పాస్ మెమోలు, కులం, ఆదాయం, నివాసం, ఆధార్‌కార్డుల ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్‌తోపాటు, జిరాక్స్ కాపీలతో జిల్లా ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్న వివరాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు.
సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలి
నెహ్రూసెంటర్: మేడారం జాతర సమీపిస్తున్నందున వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారుల డ్యూటీలు, అవసరమైన మందుల ఏర్పాటు, అంబులెన్స్, ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన వైద్య సిబ్బంది సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో పలు విభాగాలపై సమీక్ష సమావేశం, వైద్యాధికారులతో జూమ్ మీటింగ్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఆరోగ్య సిబ్బంది ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు, మెడికల్ క్యాంపులపై పలు సూచనలు చేశారు. అసంక్రమిత వ్యాధులు స్క్రీనింగ్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధుల గుర్తింపు వంటి ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. క్షయవ్యాధి నివారణకు ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పరీక్షలు పెంపొందించి క్షయవ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రోగ్రాం అధికారులు సుధీర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, విజయ్, శ్రవణ్‌కుమార్, నోడల్ ఆఫీసర్ ప్రత్యూష తదితులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
ములుగు: జిల్లాలోని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ.వేణుగోపాల్ సూచించారు. జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల న్యాయ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై పెండింగ్‌లోని సివిల్, క్రిమినల్, ఇతర కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయ పరిపాలన విషయాలపై చర్చించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్య చంద్రకళ, భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్ బాబు, మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఎన్నికల బరిలో ఇరిగేషన్ ఈఈ సతీమణి


