సిలిండర్ కావాలంటే.. ఓటీపీ చెప్పాల్సిందే..
మహబూబాబాద్: గ్యాస్ సిలిండర్ డెలివరీకి ఓటీపీ తప్పనిసరైంది. ఓటీపీ లేకుంటే సిలిండర్ ఇవ్వడం లేదు. దీంతో మొబైల్ నంబర్, అడ్రస్‌లు, ఇతరత్ర సమాచారం అప్‌డేట్‌తోపాటు కేవైసీ చేసుకునేందుకు వినియోగదారులు పరుగులుపెడుతున్నారు. ఓటీపీతోపాటు ఇన్సూరెన్స్, సబ్సిడీ విషయంలో కూడా కేవైసీ తప్పనిసరి అనే నిబంధన విధించారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
జిల్లాలో 2,11,531 కనెక్షన్లు..
జిల్లాలో హిందూస్తాన్, పెట్రోలియం కార్పొరేషన్, లిమిటెడ్ కంపెనీ, ఇండెన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కంపెనీకి చెందిన కనెక్షన్లు మొత్తం 2,11,531 ఉన్నాయి. హెచ్‌పీ గ్యాస్ సిలెండర్ ధర రూ.924 ఉండగా డెలివరీ పేరుతో అదనంగా రూ.16తో మొత్తం రూ.940 తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూ.47.38 రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.326.62 రావాల్సి ఉంది. కానీ, ప్రతిసారి రావడంలేదని పలువురు వినియోగదారులు చెబుతున్నారు.
గతంలో ఓటీపీ లేకుండానే..
ఓటీపీ తప్పనిసరి కావడంతో వినియోగదారులు సెల్ నంబర్ అప్‌డేట్ చేసుకుంటున్నారు. సెల్ నంబర్ మార్చిన వారు, ఇతర సమస్యలు ఉన్నవారు కార్యాలయాలకు వెళ్లి మార్చుకుంటున్నారు. అడ్రస్ మారినవారు కూడా ఇంటి నంబర్, అడ్రస్ అప్‌డేట్ చేసుకుంటున్నారు. కాగా, గత నెల వరకు ఓటీపీ లేకుండా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఏజెన్సీలు ప్రస్తుతం ఓటీపీ తప్పనిసరి చేశాయి.
కేవైసీ సైతం..
గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలతోపాటు డెలివరీ వర్కర్లు కూడా కేవైసీ చేస్తున్నారు. కేవైసీ(నో యువర్ కస్టమర్) కోసం ఆధార్ నంబర్, గ్యాస్ కనెక్షన్ నంబర్ ఇస్తే వెంటనే కేవైసీ చేస్తున్నారు. ఆధార్ కూడా అప్‌డేట్ చేసుకుంటున్నారు. ఇతర ఏ సమస్య ఉన్నా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్యాస్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు కూడా కేవైసీ తప్పనిసరి అయింది.
కనెక్షన్ తీసుకున్నప్పుడే కంపెనీ ఇన్సూరెన్స్
గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడే సదరు కంపెనీ వినియోగదారులపై ఇన్సూరెన్స్ చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చే విషయంలో కేవైసీ, సెల్ నంబర్ అప్‌డేట్ అడ్రస్‌లు అప్‌డేట్ ఉండాలి. అవి సరిగా లేకుంటే ఇన్సూరెన్స్ రాదని అధికారులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్ విషయంలో ఐఎస్‌ఐ స్టౌవ్ సురక్షా పైపు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వాడాలనే నిబంధనలు ఉన్నాయి. కనెక్సన్ తీసుకున్నప్పుడు ఒక అడ్రస్ ఉండి ప్రమాదం జరిగినప్పుడు వేరే అడ్రస్‌లో ఉంటే వర్తించదు. కావున వినియోగదారులు అడ్రస్ మారితే అప్‌డేట్ చేసుకోవాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
సబ్సిడీలో గందరగోళం
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇచ్చే విషయంలో స్పష్టత లేదు. కొంతమందికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ వస్తుంది. దీంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.
ఓటీపీ ఉంటేనే సిలిండర్
వినియోగదారులు గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే ఓటీపీ ఉండాల్సిందే. అందుకోసం మొబైల్ నంబర్ అప్‌డేట్, కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. అడ్రస్ మార్పులు ఉంటే కూడా మార్చుకోవాలి.
– బోనగిరి ప్రసాద్, హెచ్‌పీ గ్యాస్ డీలర్ కార్యాలయం మేనేజర్
గ్యాస్ కార్యాలయాల్లో వినియోగదారుల రద్దీ
కేవైసీ, మొబైల్ నంబర్ అప్‌గ్రేడ్
కోసం క్యూ
అందరికీ అందని సబ్సిడీ
కేవైసీ అప్‌డేట్ చేయించుకుంటున్న
మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్(ఫైల్)


