పోలీస్ శాఖకు హోంగార్డులు అదనపు బలం
మహబూబాబాద్ రూరల్ : పోలీస్ శాఖకు హోంగార్డులు అదనపు బలం అని.. ప్రజల రక్షణ, అంతర్గత భద్రతలో పోలీసు శాఖకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో 1946 డిసెంబర్ 6న స్వచ్ఛందంగా ఏర్పాటైనదే హోంగార్డ్ వ్యవస్థ అని ఎస్పీ శబరీశ్ అన్నారు. 63వ హోంగార్డ్స్ రైసింగ్ డే ను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో రైసింగ్ పరేడ్ శనివారం నిర్వహించగా హోంగార్డ్స్ నుంచి ఎస్పీ శబరీశ్ గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో హోంగార్డుల సేవలు మరువలేనివన్నారు. హోంగార్డులు కూడా పోలీస్ వ్యవస్థలో భాగమని, వారి సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. పోలీసు కానిస్టేబుళ్లకు ఏమాత్రం తీసిపోకుండా, హోంగార్డులకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డ్ సిబ్బందికి రివార్డులు, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు, క్రీడల్లో విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీఎస్పీ గండ్రతి మోహన్, టౌన్ డీఎస్పీ తిరుపతిరావు, ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, అర్‌ఐలు భాస్కర్, సోములు అనిల్, నాగేశ్వర్ రావు, ఆర్‌ఎస్సై శేఖర్, హోంగార్డు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జన్ను జంపయ్య పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
గార్ల: విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణించాలని ఎస్పీ శబరీశ్ సూచించారు. శనివారం గార్ల నిర్మలా హైస్కూల్లో రాష్ట్రస్థాయి అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తొలుత నిర్మలా హైస్కూల్ విద్యార్థులు ఎస్పీకి మార్చ్‌ఫాస్ట్ తో స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. ప్రణాళికతో చదివితే లక్ష్యం సాధించవచ్చని సూచించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన బాలురు, బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న, ప్రిన్సిపాల్ సిస్టర్ జిన్సీ, క్రీడల జిల్లా జోనల్ సెక్రటరీ గూగులోత్ శ్రీను, సత్యనారాయణ, పీడీలు పద్మ, శేఖర్, హరి, పవన్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ శబరీశ్
ఘనంగా హోంగార్డ్స్ రైసింగ్ డే వేడుకలు
పోలీస్ శాఖకు హోంగార్డులు అదనపు బలం


