కల్యాణ మండపం పెండింగ్ పనులు షురూ
హన్మకొండ కల్చరల్: హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపం పెండింగ్ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గత నెల 29న వరంగల్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. పనులు పెండింగ్‌లో ఉండడంతో పురావస్తుశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా పనులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఆలయ పనుల పూర్తి నివేదికను ఇవ్వాలని పురావస్తుశాఖ అధికారులను ఆదేశించారు. పురావస్తుశాఖ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ఎం.మల్లేశం, ఇంజనీర్ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. దక్షిణ భాగంలో మిగిలి ఉన్న కల్యాణమండపం పైభాగం, లోపలి భాగంలో నాట్యమండపం పనులు చేపట్టారు. పద్మాక్షిగుట్ట వద్ద నంబర్లు వేసిన ఉంచిన రాళ్లు, స్తంభాలను దేవాలయానికి తరలించారు.


