పల్లె పరిపుష్టికి బాట..
పంచాయతీల విధులు, బాధ్యతలు..
1959లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు
జనగామ: ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు.. రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకు.. వివిధ కార్యక్రమాల నిమి త్తం పల్లెకు ఏ ప్రజాప్రతినిధి, ఏ అధికారి వచ్చినా సభకు అధ్యక్షత వహించేది గ్రామ సర్పంచే. దేశ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న గ్రామాల నుంచి వచ్చే ఆర్థిక వనరులే అత్యంత ప్రధానం. అందుకే గ్రామ ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచింది. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1959లో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలికారు. రాజస్థాన్‌లో మొదట అమలైన ఈ వ్యవస్థ.. వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించింది. పల్లె పాలనను బలపర్చేందుకు పంచాయతీల నుంచి మూడు శాఖలను వేరుచేసి గ్రామీణాభివృద్ధి, శానిటేషన్, వసతి వంటి 15 కీలక శాఖలను జీపీల పరిధిలోకి చేర్చారు. సర్పంచ్ ఆధ్వర్యంలోని ఈ వ్యవస్థ గ్రామాలకు స్వయం పాలన అందించే ప్రజాస్వామ్య వేదికగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో 65 ఏళ్లు దాటి.. 66వ సంవత్సరంలోకి అడుగిడిన పంచాయతీ శాఖ ప్రయాణంపై పల్లె పాలన గుర్తు చేస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
పంచాయతీరాజ్ గొడుగు కింద 29 శాఖలు
గ్రామ పంచాయతీ పరిధిలో 15 శాఖలు పనిచేస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కింద రెవెన్యూ మినహా మొత్తం 29 శాఖలు ఉండగా, 15 శాఖలు మాత్రమే ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. నేటికీ వందశాతం బదలాయింపు జరగలేదు. ప్రధానంగా విద్యుత్, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, విద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పశువైద్యం, పౌరసరఫరాలు, రోడ్ల భవనాలు, మత్స్యశాఖ, గృహనిర్మాణం, ఇరిగేషన్ శాఖలు గత కొంతకాలం వరకు కొనసాగాయి.
పంచాయతీల్లో సేవలందించేది ఎవరు?
పంచాయతీల్లో గ్రామపాలన కొనసాగించడానికి వీరంతా చాలా ముఖ్యం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి, కారోబార్ సేవలు క్షేత్రస్థాయిలో ఉంటాయి. గ్రామ పంచాయతీ పాలన , గ్రామీణాభివృద్ధి, ఈజీఎస్, గ్రామీణ గృహ నిర్మాణ శాఖలు, శానిటేషన్, స్వచ్ఛ భారత్ మిషన్, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, రహదారులు, సామాజిక భద్రత, పెన్షన్ విభాగం, గ్రామ స్థాయి ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖ సబ్ సెంటర్లు, వ్యవసాయ అనుబంధ శాఖ, పశుసంవర్థక శాఖ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, అంగన్‌వాడీ ఆయాలు.. వీరంతా నిత్యం గ్రామస్థాయిలో సేవలు అందిస్తారు. వీరంతా పంచాయతీ పాలనకు జవాబుదారీగా ఉంటారు.
పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం..
పంచాయతీ వ్యవస్థ గతంతో పోలిస్తే నిర్వీర్యం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్(మూడు అంచెలు) మాత్రమే పరిగణనలోకి ఉండగా వీటికి అదనంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. 1959లో పంచాయతీల ఆవిర్భావంలో రెవెన్యూ మినహా అన్ని శాఖలు ఒకే గొడుగు కిందకు ఉండడంతో సర్పంచ్‌లదే పై చేయిగా ఉండేది. సర్వాధికారాలు సర్పంచ్‌లకే ఉండడంతో వివిధ శాఖల అధికారులకు ఇబ్బందులు తలెత్తేవి. దీంతో స్వయం ప్రతిపత్తి హోదా కావాలని వ్యవసాయం, విద్యుత్, విద్యాశాఖ అధికారులు పట్టుబడ్డారు. దీంతో మూడు శాఖలతో పాటు ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో నుంచి విడిపోవడంతో ప్రత్యేక శాఖలుగా ఆవిర్భవించాయి. దీంతో పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచ్‌ల పాత్ర నామమాత్రంగా మారిపోయింది.
కాళేశ్వరం: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్నాయి. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లో కూడా ‘నోటా’ ఓటును వినియోగించుకునేలా ఓటర్లకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో నిరక్ష్యరాస్యుడైన మామ, అక్షరాస్యుడైన తన అల్లుడితో ‘నోటా’ వినియోగంపై జరిగిన సరదా సంభాషణ ‘సాక్షి’ పాఠకులకు అందిస్తుంది.
అల్లుడు: మామ నమస్తే మనఊళ్లో సర్పంచ్ ఎలక్షన్లు ఎలా జరుగుతానయే.
మామ: ఏమి అల్లుడా బాగేన. పట్నం (హైదరాబాద్ ) నుంచి ఎప్పుడచ్చినవ్. ఏమి ఎలచ్చన్లు రా. ధూంధాం నడస్తనయ్. కని నాకు నచ్చనోళ్లు సర్పంచ్‌కు నలుగురు ఏసిండ్రు. మనోళ్లే లేరు.
అల్లుడు: ఏ మామ నీకు తెల్వదానే. ఎందుకు బాధ పడుతవ్. ఈసారి బ్యాలెట్ పేపర్లో కూడా నోటాకు రాష్ట్ర ఎనికల సంఘం అవకాశం కల్పించింది.
మామ: గీ నోటా ఓటు ఏంది అల్లుడా..
అల్లుడు: నోటా అంటే (నన్ ఆఫ్ ది ఎబో) పైవి ఏవి కావు అని అర్థం. నీకు నచ్చని వారు పోటీలో ఉంటే నోటాకు నీ ఓటు వేయొచ్చు. నీ ఓటు వినియోగించుకున్నట్లు కూడా అవుతుంది.
మామ: నోటాకే ఓట్లు బాగా పడితే ఎట్లా రా?
అల్లుడు: నోటాకు ఓట్లు ఎక్కువ పడితే రెండో అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారట.
మామ: గిదెప్పటి నుంచి అమలవుతోంది.
అల్లుడు: పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోటా అవకాశం కల్పించారు. కానీ ఈసారి బ్యాలెట్ పేపర్‌లో ఇవ్వడంతో పల్లెల్లో కూడా వినియోగిస్తారు.
మామ: సరే అల్లుడా..మాఊళ్ల అందరికీ నోటా ఓటు గురించి సెప్పుతా. ఇగ ఉంటా. ఓట్లయినంక కలుద్దాం.
గెలిచినోళ్లం గురించి మాట్లాడుకుందాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్(45) ప్రకారం జీవో 138 పీఆర్ ప్రకారం తాగునీరు, సరఫరా, పారిశుద్ధ్యం, లైటింగ్, అంటువ్యాధుల నివారణ.. వంటి సేవలు అందిస్తున్నారు. అలాగే వంతెనలు, కల్వర్టులు, రహదారుల పునరుద్ధరణ తదితర మరమ్మతుల నిర్వహణతో పాటు పబ్లిక్ స్థలాల్లో విద్యుత్ సరఫరా అందించాలి. డ్రైనేజీ, వర్షపునీరు నివాస ప్రాంతాలకు రాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉంటుంది. శానిటేషన్ నిర్వహణలో పంచాయతీల పర్యవేక్షణ చాలా కీలకం. ప్రధాన కూడళ్లలో కుండీల ఏర్పాటు, తడి, పొడి చెత్త వేరుచేయడంతో పాటు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి. శ్మశాన వాటికలు, జంతు కబేళాలు, సామూహిక మరుగుదొడ్లు, డంపింగ్ యార్డుల నిర్వహణ, పరిశుభ్రత బాధ్యత కీలకం. వీటితోపాటు స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలికంగా ప్రజావసరాలను చేపట్టాల్సి ఉంటుంది. జనన, మరణాల ధ్రువీకరణ నమోదు, వరదనీరు, తాగునీటి పరిరక్షణ తదితర అంశాలను పంచాయతీలే పర్యవేక్షించాలి. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 46 ప్రకారం గ్రంథాలయాల నిర్వహణ, దివ్యాంగులు, నిరాదరణకు గురై దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రోత్సాహం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
66 ఏళ్ల పీఆర్ ప్రయాణంలో
అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామాలు
పల్లె పాలనకు మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పునాది..
పల్లె పరిపుష్టికి బాట..
పల్లె పరిపుష్టికి బాట..
పల్లె పరిపుష్టికి బాట..


