అభ్యర్థులూ.. అలర్ట్
వరంగల్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచా యతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది. ఈ సమయంలో కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికలకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో కోడ్ ఎందుకు విధిస్తారు? దానిని ఉల్లంఘిస్తే ఈసీ ఏం చర్యలు తీసుకుంటుంది అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
కోడ్ ఎందుకంటే..
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీనినే ‘మోడల్ ఆఫ్ కోడ్ కండక్ట్’(ఎంసీసీ) అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ, అభ్యర్థి ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకుంటుంది.
ఇదీ ఎన్నికల నియమావళి..
ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నిషేధం ఉంటుంది. ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలి.
● కోడ్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించొద్దు.
● ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించొద్దు.
● మంత్రులు, ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులకు ఆర్థిక గ్రాంట్‌ను, వాటికి సంబంధించిన హామీలను ప్రకటించొద్దు. ఎక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయొద్దు. మంత్రులు అధికారిక వాహనాలను, యంత్రాంగాన్ని వినియోగించొద్దు.
● ఎవరైనా ప్రభుత్వ అధికారి, సిబ్బంది అధికార మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 218లో పేర్కొన్న విధంగా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
● ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి మంత్రులు గాని, ఇతర అధికారులు విచక్షణ నిధుల నుంచి గ్రాంట్లు/చెల్లింపులను మంజూరు చేయొద్దు.
● గృహ నిర్మాణ పథకం మంజూరై, పని ప్రారంభిస్తే లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సాయం అందాలి. ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త నిర్మాణాలను చేపట్టడం లేదా కొత్త లబ్ధిదారులను ప్రకటించొద్దు. సహాయాన్ని అందించొద్దు.
● కరువు, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైఫ రీత్యాలు సంభవిస్తే బాధితులకు ఎస్‌ఈసీ అనుమతితో ప్రభుత్వం సహాయాన్ని అందించాలి.
ఎలా మొదలైంది..
1960 కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’(ఎంసీసీ)మొదలైంది. రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి అంగీకారం తెలిపిన తర్వాతే ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేశారు. ఇందులో ఎలాంటి నిబంధనలను పాటించాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాత, 1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రవర్తనా నియమావళిని అనుసరించారు.
నగదు రూ.50 వేలకు మించి ఉండొద్దు..
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తన వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి దానికి సంబంధించిన సరైన పత్రాలు చూపలేకపోతే ఆ డబ్బులను పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో లభించిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ఎక్కువ ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి సదరు డబ్బులను కోర్టులో జమ చేస్తారు.
కోడ్ ఉల్లంఘిస్తే
ఎన్నికలకు దూరమే..
అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు
నేరం రుజువైతే జైలు శిక్ష కూడా..
రూ.50 వేలకు మించి తరలించొద్దు..
గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులూ అలర్ట్‌గా ఉండాలి. లేదంటే ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి రావొచ్చు. ఎందుకంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని(కోడ్) ఉల్లంఘించిన వారిని పోటీ చేయకుండా నిషేధించే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయొచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడొచ్చు. అందుకే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే.
అభ్యర్థులూ.. అలర్ట్


