ఉప సర్పంచ్ .. పవర్ ఫుల్
● నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్ పవర్
● పల్లెల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి తీవ్ర పోటీ
సంగెం: పల్లె పాలనలో ఉప సర్పంచ్ కీలక భూమిక పోషించనున్నారు. ఇంతకాలం నామమాత్రపు పాత్రకే పరిమితమైన ఉపసర్పంచ్.. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం పవర్‌ఫుల్‌గా మారారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా ఉమ్మడి చెక్‌పవర్‌ను కట్టాబెట్టారు. ఈ నిర్ణయం ఉప సర్పంచ్ పదవిని బలంగా తయారు చేసింది. దీంతో తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. అందుకే ఎన్నికలకు ముందు నుంచి తమ ప్యానల్ గెలిస్తే ఫలనా అభ్యర్థికి ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలనే ఖండిషన్లు సైతం పెట్టుకుంటున్నారు. ఏకగ్రీవమైన చోట్ల అధికార పక్షం వారికి సర్పంచ్ పదవి ఇస్తే, ప్రతిపక్షానికి ఉప సర్పంచ్ ఇవ్వాలనే షరతు విధించుకుంటున్నారు. ఏది ఏమైనా పంచాయతీలో ఉప సర్పంచ్ పదవి కీలకంగా మారనుంది.
చెక్ పవర్ ఇద్దరికి ..
బాధ్యత ఒక్కరిదే..
సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్ ఉంటుంది. నిధుల నిర్వహణ సర్పంచ్‌లకు ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో విఫలమైన సర్పంచ్‌పై చర్యలు తీసుకునే అవకాశం 2018 పంచాయతీరాజ్ చట్టానికి ఉంది. అయితే ఉప సర్పంచ్ సహా పాలకవర్గాన్ని ఇందులో భాగస్వాములను చేయకపోవడం గమన్హారం. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు జరిగినా, నిర్ణీత వ్యవధిలో అనుమతులు ఇవ్వకపోయినా సర్పంచ్‌పై వేటు పడుతుంది. ఈ విషయంలో ఉప సర్పంచ్‌కు మినహాయింపు ఉంది. అందుకే ప్రస్తుత జీపీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది.


