ముగిసిన ఆరు జిల్లాల క్రికెట్ జట్ల ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరుణాపురం సమీపంలోని వంగాలపల్లిలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆరు జిల్లాల స్థాయి అండర్–16 క్రికెట్ ఎంపిక పోటీలు గురువారం ముగిశాయి. ఈ ఎంపికల్లో హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ పుల్లూరి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో అఫ్జల్, పవన్ సమక్షంలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ఆరు జిల్లాల తుది జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న ఆరు జిల్లాల జట్లకు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు మొగిలిచర్ల, వంగాపల్లి క్రికెట్ మైదానాల్లో ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచే క్రీడాకారులతో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టును ఎంపిక చేసి హైదరాబాద్‌లో ఈనెలలో జరిగే హెచ్‌సీఏ లీగ్ పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు మంచిక అభినవ్‌వినయ్, శంకర్, కోచ్‌లు సందీప్‌నేత్ర, రాజ్‌కుమార్, మెతుకు కుమార్, తదితరులు పాల్గొన్నారు.


