నాకు యాదికొత్తాంది!
గీసుకొండ: నా పేరు బత్తాయిల సాంబయ్య! గ్రామపంచాయతీ ఎన్నికలకు మా ఊర్ల నామినేషన్లు ఏత్తాండ్లని తెలిసి మా పెద్దలు చెప్పిన మాటలు యాదికొత్తానయ్.. మా చిన్నతనం ఊర్లర్ల మొగుడు, పెళ్లం (భార్యాభర్త) పంచాయితీలు, అన్నదమ్ముల నడుమ ఆస్తి, భూముల పంపకాల గొడవలు, గెట్ల పంచాయితీలను పెద్ద మనుషులు చేసేటోండ్లు. ఆ పెద్ద మనుషులళ్ల మంచోళ్లను ఊరి జనం సర్పంచ్‌గా నిలబెట్టి గెలిపించేటోళ్లట. పైసా ఖర్చు లేకుంట మంచి తనాన్ని చూసి జనాలు ఓటు ఏసేటోరట.. గందుకనే అప్పట్ల ఊర్లళ్ల ప్రశాంతంగా ఉండేదని పెద్దలు జెప్పంగ ఇన్న.. వారికన్నా ముందుగాల పంచాయతీ ఎన్నికలు ఎలాగుండేవో నాకు తెల్వదు. దొరలు రాజ్యమేలిండ్లని మా తాతముత్తాతలు మాట్లాడుకునేటోళ్లు.. సర్పంచ్ అంటే గ్రామం గురించి పని చేసే పెద్దాయని అని అనుకునేటోళ్లు. ఇప్పుడైతే పేదోడు, డబ్బు లేనోడు సర్పంచ్ అయ్యే అవకాశమే లేదు. గాంధీ తాత నిలబడ్డా కష్టమే అంటాండ్లు. గ్రామాల్లో భూములు, జాగలు, డబ్బున్లోళ్లదే రాజ్యం. గందుకనే ఓటరును జేబుల ఏసుకోవడానికి డబ్బును ఎరగా ఏత్తాళ్లు. ఓటుకు రూ. వెయ్యే కాదు రూ. 5 వేలు ఇచ్చేందుకు ఆల్లు ఎనకడుగు ఏయడం లేదు. సర్పంచ్ పదవంటే అంగట్ల సరుకుగా మారిపోయిందంటున్నారు. అవసరమైతే అర్రాజు(వేలం) పాడి సర్పంచ్‌గా అయిదం అనుకునేటోల్లూ ఉన్నరు. గ్రామానికి మొదటి పౌరుడంటే నాటి అర్థమే మారిపోయిందని జనాలు గుబులు పడుతాండ్లు. సర్పంచ్ అనేటోడు ఊరికి ఉపకారం జేసే పనులు జేయాలని కోరుకుంటాండ్లు అమాయక జనాలు.
● జీపీ ఎన్నికలపై ఓటరు అభిప్రాయం


