ఏకగ్రీవంపై నజర్ !
సాక్షి, మహబూబాబాద్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. కొన్ని గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో పోటీలో నిలబడి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపిక పరంపర కొనసాగుతోంది. అయితే పోటీలో నిలబడి డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకని, ఏకగ్రీవంగా ఎంపికై తే గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని పెద్దల సమక్షంలో అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. అన్ని పార్టీల నాయకులను ఒప్పించి పలు పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంటున్నారు.
పంచాయతీల ఏకగ్రీవం
మొదటి విడత ఎన్నికలు జరిగే 155 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. అయితే ఇప్పటి ఐదు మండలాల పరిధిలో ఆరు పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గూడూరు మండలం రాజనపల్లి, కేసముద్రం మండలం క్యాంపుతండా, ఇనుగుర్తి మండలం రాములుతండా, నెల్లికుదురు మండలం పార్వతమ్మ గూడెం, మహబూబాబాద్ మండలం రెడ్యాల, సికింద్రాబాద్ తండాల నుంచి ఒకే ఇక అభ్యర్థి పోటీలో ఉండగా ఏకగ్రీవంగా అయినట్లు అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు రెండో విడత, మూడో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో కూడా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకునేందుకు మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది.
అభివృద్ధికి నిధులు
గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన సర్పంచ్ పదవి ఇస్తే గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తానని పలువురు అభ్యర్థులు ముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామంలో గుడి, చర్చి కట్టించేందుకు నిధులు ఇస్తానని అంగీకారం చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం గ్రామ పెద్దల సమక్షంలో అగ్రిమెంట్లు కూడా రాసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా మరికొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు స్థలం లేక ఆగిపోయాయి. ఏకగ్రీవంగా సర్పంచ్‌ని చేస్తే మూడు గుంటల ఇంటి స్థలం ఇస్తానని ప్రకటించడంతో అగ్రిమెంట్ చేసుకొని ఆ గ్రామంలో ఇతర సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మరొక గ్రామంలో బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అభ్యర్థిని కాంగ్రెస్ లో చేరుతాననే ఒప్పందంపై ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. వీటితోపాటు అధికార పార్టీలో కీలకంగా పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవ సర్పంచ్ చేస్తే ప్రభుత్వ నిధులు ఇస్తానని, గ్రామంలో ఉన్న పెండింగ్ పనులు, సొంత ఖర్చులతో గుడి నిర్మిస్తానని హామీ ఇవ్వడంతో ఆ గ్రామాల్లో ఇతర పార్టీల మద్దతుదారులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కోతులను పట్టిస్తానని, మరికొన్ని గ్రామాలు, తండాల్లో దర్గమ్మ, రామాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయం సొంత ఖర్చులతో నిర్మిస్తామని ఎర వేస్తూ సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పలువురు అభ్యర్థుల మధ్య పోటీ పెరగడంతో రూ. 5లక్షల నుంచి రూ. 20లక్షల వరకు డిపాజిట్ కూడా చేసి సర్పంచ్ ఏకగ్రీవానికి కు సిద్ధం అవుతున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఐక్యతారాగం
మహబూబాబాద్ రూరల్ : అధికారపక్షం, ప్రతిపక్షం ఐక్యతారాగం వినిపించిన సంఘటన మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల, సికింద్రాబాద్ తండా గ్రామాల పరిధిలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రెడ్యాల, సికింద్రాబాద్ తండా గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరించారు. కాగా. బుధవారం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన సందర్భంగా సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కేఎస్‌ఎన్ రెడ్డి తమ పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో రెడ్యాల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఐలబోయిన లక్ష్మి, సికింద్రాబాద్ తండా గ్రామం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన నూనావత్ ఇస్తారిని ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా రెడ్యాల జీపీ పరిధిలోని పది వార్డులు కాంగ్రెస్ పార్టీ, సికింద్రాబాద్ తండా జీపీ పరిధిలోని ఎనిమిది వార్డుల బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.
గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామని హామీ
గుడి నిర్మాణం, గ్రామ పంచాయతీలకు స్థలం ఇచ్చేందుకు అంగీకారం
గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందాలు
ఏకగ్రీవంగా పంచాయతీల కై వసం
ఏకగ్రీవంపై నజర్ !
ఏకగ్రీవంపై నజర్ !


