ప్రీ ప్రైమరీ ఆలస్యం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు ఆలస్యమవుతోంది. ఇతర జిల్లాలో ప్రక్రియ పూర్తి చేసుకొని పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండగా.. జిల్లాలో మాత్రం ఎక్కడి పనులు అక్కడే ఉన్నట్లు తెలిసింది.
టెండర్ దశలో మెటీరియల్ కొనుగోలు..
పుట్టగొడుగుల్లా వెలసిన ప్రైవేట్ కిడ్స్ పాఠశాలలకు దీటుగా నిరుపేద కుటుంబాల పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అందించేందుకు జిల్లాలో 22 ప్రీప్రైమరీ పాఠశాలలు మంజూరు చేశారు. ఇందులో పిల్లలు కూర్చునేందుకు కుర్చీలు, గ్రూపు టేబుల్స్, టీచర్ టేబుల్, మెటీరియల్ స్టోరేజీ రాక్స్, పుస్తకాలు భద్రపరిచే రాక్స్, ప్లే మెటీరియల్ డబ్బాలు, ఔట్‌డోర్, ఇండోర్ క్రీడా పరికరాలు, చదవడం, రాయడానికి ఉపయోగించే మెటీరియల్‌తో పాటు సెంటర్‌లో ఆకర్షణీయమైన పెయింటింగ్ వేయించడం కోసం నిధులు మంజూరు చేశారు. మొత్తం ఒక్కో పాఠశాలకు రూ. 1.70లక్షలు కేటాయించారు. మెటీరియల్ సరఫరా చేసేందుకు టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెల నాల్గో తేదీ వరకు టెండర్లు వేయడం.. తర్వాత కాంట్రాక్టర్‌కు అప్పగించనున్నారు.
పూర్తి కాని టీచర్, ఆయాల నియామకం
ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పనిచేసేందుకు ఒక టీచర్, ఒక ఆయా అవసరం. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా టీచర్ పోస్టులకు 252మంది, ఆయా పోస్టులకు 99 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీచర్లు, ఆయాల ఎంపిక కోసం తమ అనుచరులకు అవకాశం ఇవ్వాలని పలుచోట్ల రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఈ ఏడాది ప్రారంభిస్తేనే..
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువు చెబుతున్నారు. అయితే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలో బోధన జరపడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా పూర్వ ప్రాథమిక దశ బోధన లేదు. ఇందుకోసం ఏర్పాటు చేసే ప్రీప్రైమరీ పాఠశాలలు ఈ ఏడాది ప్రారంభిస్తేనే.. వచ్చే విద్యా సంవత్సరం వరకు పుంజుకునే అవకాశం ఉంది. పాఠశాలలు ప్రారంభించి చిన్నపిల్లలకు మెరుగైన బోధన అందిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లలను పంపిస్తారు. కానీ, ఈ ఏడాది పాఠశాలల ఏర్పాటులో జాప్యం కావడంతో.. విద్యా సంవత్సరం ముగింపు వరకై నా పాఠశాలలు ప్రారంభించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ముందుకు సాగని ప్రక్రియ
పూర్తికాని మెటీరియల్ కొనుగోలు టెండర్లు
టీచర్, ఆయాల ఎంపికలో జాప్యం
ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభిస్తేనే వచ్చే ఏడాదిలో ఫలితాలు
ప్రక్రియ మొదలైంది
జిల్లాలో 22 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు అయ్యాయి. టీచర్, ఆయాల నియామకం కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. మెటీరియల్ కొనుగోలుకు టెండర్ పిలిచాం. ఆ ప్రక్రియ పూర్తి కాగానే మెటీరియల్ వస్తుంది. త్వరలో జిల్లాలో ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
– రాజేశ్వర్, డీఈఓ
ప్రీ ప్రైమరీ ఆలస్యం


