ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
● ఎస్పీ శబరీష్
కురవి: జిల్లా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం రాత్రి కురవి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులు, స్థానిక రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను, మద్యం, డబ్బు పంపిణీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు ఎలాంటి ఆటంకం కలిగించే యత్నాలు చేసినా పోలీసులు చూస్తు ఊరుకోరని తెలిపారు. ప్రతీ ఒక్కరు ధైర్యంగా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, బహుమతుల రూపంలో ప్రలోభా లకు గురిచేయవద్దని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. యువత సమాజంలో మార్పునకు దారి చూపే శక్తిగా ఉండాలని, అక్రమ పద్ధతులకు దూరంగా ఉండి స్వచ్ఛమైన ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని సూచించారు. ఎన్నికల రోజు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అదనపు సిబ్బంది నియామకం, 24/7 కంట్రోల్‌రూం మానిటరింగ్ వంటి ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్పయ్య పాల్గొన్నారు. జాగృతి కళాకారులు పాటలు పాడి అవగాహన కల్పించారు.
మహబూబాబాద్‌లో..
మహబూబాబాద్ రూరల్ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామాన్ని బుధవారం రాత్రి ఎస్పీ శబరీష్ సందర్శించారు. గ్రామ వీధుల్లో తిరిగి సీసీ కెమెరాలను పరిశీలించి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు ఎన్నికల సమయంలో గ్రామంలో జరిగే ప్రతీ కదలికపై నిఘా పెట్టడానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో సెన్సిటివ్, హై సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలు సృష్టించే వారు, రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్పీ వెంట డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక, పోలీసు సిబ్బంది ఉన్నారు.


