అమీనాబాద్ నుంచి అసెంబ్లీ వరకు..
నర్సంపేట : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.. అమీనాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగారు. పుట్టి పెరిగిన గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో జన్మించిన మాధవరెడ్డి.. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1981లో అమీనాబాద్ సర్పంచ్‌గా గెలుపొంది ప్రజాసేవలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ, నిబద్ధత గల నాయకుడిగా కొనసాగుతూ 1995లో డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా కొనసాగుతూ డీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. అయినా 2014లో నమ్ముకున్న పార్టీ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం లభించలేదు. దీంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించాడు. పార్టీ ఆదరించకున్నా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అధికార పార్టీ (బీఆర్‌ఎస్)లో చేరలేదు. తిరిగి కాంగ్రెస్‌లోనే చేరి నిజాయితీ గల నాయకుడిగా పార్టీలో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. గత ఎన్నికలో ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొంది నర్సంపేట అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు.
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా
అంచలంచెలుగా ఎదిగిన ‘దొంతి’


