పెళ్లికుదిరిన 10 రోజులకే అనంతలోకాలకు..
మహబూబాబాద్ రూరల్ /దుగ్గొండి: ఆ యువకుడు ఇంజనీరింగ్ చదివి రైల్వే ఉద్యోగం సాధించాడు. ఉన్నత స్థితిలో ఉండడంతో పదిరోజుల క్రితం పెళ్లి కుదిరింది. అంతలోనే విధి వక్రించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. మహబూబాబాద్ రూరల్ ఎస్సై వి.దీపిక కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి చెందిన పీరాల మల్లయ్య, రమ దంపతుల కుమారుడు భగవత్(29) ఇంజనీరింగ్ పూర్తి చేసి గతేడాది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిధిలో గల క్యారేజీ అండ్ వ్యాగన్ విభాగంలో జేఈఈగా ఉద్యోగంలో చేరాడు. ప్రతీ మూడు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గిర్నిబావిలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై మృతుడు తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భగవత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఎదిగొచ్చిన కొడుకు కళ్లెదుటే చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి మృతి
జమాండ్లపల్లి శివారులో ఘటన
గిర్నిబావిలో విషాదఛాయలు


