స్లాబ్ పైనుంచి టెంట్‌పైకి దొర్లిన రెండేళ్ల బాలుడు
● అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
కేసముద్రం: రెండేళ్ల బాలుడు మెట్ల మీదుగా స్లాబ్‌పైకి ఎక్కి టెంట్ పైకి దొర్లిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధి గిర్నితండాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బి.గణేశ్, కల్యాణి దంపతుల ఇంట్లో అయ్యప్ప పీఠం పూజ సందర్భంగా అయ్యప్ప మాలధారులను భిక్షకు పిలిచారు. ఈ మేరకు ఇంటి ఆవరణలో స్లాబ్‌కు దగ్గరగా టెంట్ వేసి కింద పూజ నిర్వహిస్తున్నారు. ఆ దంపతుల కుమారుడైన రెండేళ్ల రిత్విక్ మెట్ల మీదుగా స్లాబ్‌పైకి ఎక్కాడు. స్లాబ్ చివరకు వచ్చిన ఆబాలుడు ఒక్కసారిగా టెంట్‌పైకి దొర్లాడు. దీంతో టెంట్ మధ్యకు చేరుకున్న ఆ బాలుడు ఏడువగా.. తల్లిదండ్రులు స్లాబ్ పైకి ఎక్కి చూడగా టెంట్ మధ్యలో బాలుడు కూర్చుని ఉండడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. చాకచక్యంతో ఆ బాలుడిని పట్టుకుని కిందకు దింపడంతో ప్రమాదం తప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయ్యప్పస్వామే తమ కుమారుడిని కాపాడంటూ తల్లిదండ్రులు కొడుకుని దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహిళ ఆత్మహత్య
గీసుకొండ: మండలంలోని బాలయ్యపల్లెకు చెందిన రాగిరి సదాలక్ష్మి(59) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. సదాలక్ష్మి భర్త కొంత కాలం క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతోంది. అలాగే, ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీనిపై మనస్తాపం చెందిన సదాలక్ష్మి మంగళవారం వ్యవసాయ బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు లింగమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ బుధవారం తెలిపారు.


