జర.. తప్పుకోరాదే! | - | Sakshi
Sakshi News home page

జర.. తప్పుకోరాదే!

Dec 3 2025 9:43 AM | Updated on Dec 3 2025 9:43 AM

జర.. తప్పుకోరాదే!

జర.. తప్పుకోరాదే!

సాక్షి, మహబూబాబాద్‌: పల్లెపోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటి వరకు కలిసి పనిచేసిన నాయకులు ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారుతున్నారు. ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన వారిని బుజ్జగించేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారు. తప్పుకోరాదు తమ్ముడు అని కొందరు.. జర తప్పుకోరాదే.. మరో అవకాశం నీకే ఇస్తాం.. ఈ సారి నాకు అవకాశం ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు. ఇందుకోసం సీనియర్‌ నాయకులను రాయబేరాలకు పంపిస్తున్నారు.

పోటాపోటీగా నామినేషన్లు..

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మహబూబాబాద్‌, గూడూరు, నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం మండలాల్లో పోటా పోటీగా నామినేషన్లు వేశారు. మొత్తం 155 గ్రామ పంచాయతీలకు 1,017 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 1,338 వార్డులకు 3,334 మంది నామినేషన్లు వేశారు. అయితే వీరిలో అత్యధికంగా ఒకే పార్టీ నుంచి పోటీకి సిద్ధమైన వారు ఉన్నారు. సగటున ఒక్కో సర్పంచ్‌ పదవికి ఆరుగురికిపైగా నామినేషన్లు వేశారు.

నిన్న ఒక్కటిగా.. నేడు పోటీగా..

మహబూబాబాద్‌ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికలు, తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారం.. జిల్లా కేంద్రంలో జరిగే సమావేశాలు, నాయకుల వద్దకు ఒకే మోటారు సైకిల్‌పై వెళ్లి, ఒకే చోట తిని, తాగిన వారు సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారుతున్నారు. నేనంటే నేను సర్పంచ్‌ బరిలో ఉంటానని నామినేషన్లు వేశారు. దీంతో ఒక వైపు పోటీ పడుతున్నా.. సొంత పార్టీలోని రెబల్స్‌తో ఇబ్బంది అవుతుందని భయపడుతున్నారు. నామినేషన్‌ విత్‌డ్రా చేయించేందుకు పార్టీ పెద్దలు, కుల సంఘాల నాయకుల వద్దకు వెళ్లి బతిమిలాడుతున్నారు. కొన్నిచోట్ల ఊరికోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి పెద్ద మనుషుల వద్ద డిపాజిట్‌ పెడుతున్నారు. ఏకగ్రీవం అయితే ఊరి రూపురేఖలే మారుస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే ఇలాంటి వాతావరణం ఒకటి రెండు చోట్ల మినహా.. అత్యధిక గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య పోటీ ఉండడంతో.. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు పరిస్థితిని గమనిస్తున్నారు. పోటీలో ఉంటే తమ పార్టీ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు కబురు పంపుతున్నారు.

నేడు విత్‌డ్రాలు..

నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరిరోజు. దీంతో రెబల్‌ అభ్యర్థులను విత్‌డ్రా చేయించే పనిలో నాయకులు ఉన్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రివరకు అభ్యర్థులను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఎంత చెప్పినా ససేమిరా అంటున్న నాయకులకు ఎంపీటీసీ, ఇతర నామినేటెడ్‌ పదవులు ఇప్పిస్తామని హామీలు ఇవ్వడం, ప్రమాణాలు చేయించే పనిలో నాయకులు ఉన్నారు. ఈ పరిస్థితిలో ఎంత మంది తన నామినేషన్‌ ఉపసంహరించుకుంటారో.. ఎంత మంది బరిలో ఉంటారో బుధవారం సాయంత్రం వరకు తేలనుంది.

రెబల్‌ అభ్యర్థులతో రాయ‘బేరాలు’

గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందాలు

మరో అవకాశం ఇస్తామని బుజ్జగింపులు

నేడు మొదటి విడత నామినేషన్ల విత్‌డ్రాల పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement