ఎక్కడి పనులక్కడే.. | - | Sakshi
Sakshi News home page

ఎక్కడి పనులక్కడే..

Nov 26 2025 6:27 AM | Updated on Nov 26 2025 6:33 AM

డోర్నకల్‌: జిల్లాలోని డోర్నకల్‌ మున్సిపాలిటీలో ఆరేళ్ల క్రితం చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు ప్రభుత్వ భవనాల పనులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2019లో శంకుస్థాపన..

2018 ఆగస్టు 2న డోర్నకల్‌ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. 2019లో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.19.40 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులు మంజూరయ్యాయి. 2019 జూన్‌ 12న అప్పటి ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మెయిన్‌ రోడ్డు అభివృద్ధి, సీసీ రోడ్లు, మేజర్‌ డ్రెయినేజీలు, సెంట్రల్‌ లైటింగ్‌, హైమాస్ట్‌ లైట్లు, పార్కులు, ఆడిటోరియం, మినీ ఆడిటోరియం, గెస్ట్‌ హౌస్‌, మోడల్‌ మార్కెట్‌, వైకుంఠథా మం, జంక్షన్‌ అభివృద్ధి, డంపింగ్‌ యార్డు తదితర పనులకు రెడ్యానాయక్‌ శంకుస్థాపన చేశారు.

కొన్ని పనులే పూర్తి...

బైపాస్‌ రోడ్డు నుంచి రైల్వే స్టేషన్‌ వరకు రోడ్డును అభివృద్ధి చేసినా కొంతమంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్డుతో పాటు డ్రెయినేజీలకు సంబంధించి పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాలేదు. పలు వీధుల్లో సిమెంట్‌ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. బైపాస్‌ రోడ్డులో సెంట్రల్‌లైటింగ్‌, రెండు కూడళ్లలో ఫౌంటెయిన్‌లు ఏర్పాటు చేశారు. బతుకమ్మ పార్కు పనులు పూర్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం పూర్తికావడంతో ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు.

కోర్టు స్టేతో నిలిచిన పనులు..

మున్సిపాలిటీ పరిధి గాంధీసెంటర్‌లోని కూరగాయల మార్కెట్‌ ఆవరణలో రూ.2.37 కోట్లతో చేపట్టిన మోడల్‌ మార్కెట్‌ భవన నిర్మాణ పనులు కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో నిలిచిపోయాయి. డంపింగ్‌ యార్డు, గెస్ట్‌హౌస్‌, ఆడిటోరియం ఏర్పాటు ఊసే లేదు. మినీ ఆడిటోరియం పనులు మందకొడిగా సాగుతున్నాయి. రూ.80 లక్షలతో పది ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చేపట్టిన హైమాస్ట్‌ లైట్ల పనులు పునాదుల్లోనే నిలిచాయి. అంబేడ్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసి హైమాస్ట్‌ లైట్లు నేటికీ ప్రారంభం కాలేదు. పనులు నిలిచి ఏళ్లు గడుస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భవనాలకు మోక్షమెప్పుడో..

మున్సిపాలిటీ నిధులతో సంబంధం లేకుండా నా లుగేళ్ల క్రితం బైపాస్‌ రోడ్డులోని వ్యవసాయ మార్కె ట్‌ ఆవరణలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టిన వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ పనులు పునాదుల్లోనే నిలిచా యి. 2018లో రూ.1.10 కోట్ల ఐటీడీఏ నిధులతో చేపట్టిన గిరిజన భవనం పనులు 80 శాతం మాత్ర మే పూర్తయ్యాయి. బుద్దారం రోడ్డులో 2018లో రూ.30 లక్షల నిధులతో చేపట్టిన ఐకేపీ భవనం పనులు 80శాతం పూర్తయ్యాయి. గార్ల రైల్వే గేట్‌ నుంచి సమ్మర్‌ స్టోరేజీ సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు రూ.6 కోట్ల నిధులతో చేపట్టిన బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు భూసేకరణ సమస్యతో నిలి చాయి. 2022లో మున్నేరువాగు సమీపంలో రూ.కో టి నిధులతో చేపట్టిన వైకుంఠథామం పనులు 70శాతం పూర్తయ్యాయి. బైపాస్‌ రోడ్డులో రూ.2 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో ఏర్పాటు చేసిన మోడ్రన్‌ దోభీఘాట్‌ భవన నిర్మాణం పూర్తయి, యంత్రాలను సిద్ధం చేసినప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేక ప్రారంభానికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో రూ.80 లక్షల నిధులతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవన నిర్మాణ పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు.

నిధుల కొరత...

నిధుల కొరతతో అభివృద్ధి పనులు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, పాలకవర్గం లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో మున్సిపాలిటీ అభివృద్ధికి గ్రహణం పట్టిందని స్థానికులు వాపోతున్నారు.

డోర్నకల్‌ మున్సిపాలిటీ పరిధిలో నిలిచిన అభివృద్ధి

అసంపూర్తిగా గిరిజన,

ఐకేపీ కార్యాలయాల భవనాలు

శ్మశానవాటిక, కూరగాయల మార్కెట్‌ భవనాలదీ ఇదే పరిస్థితి

ప్రారంభానికి నోచుకోని దోభీఘాట్‌

ఎక్కడి పనులక్కడే.. 1
1/1

ఎక్కడి పనులక్కడే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement