విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
● ప్రారంభమైన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్, సైన్స్‌ఫెయిర్ ప్రదర్శనలు
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్‌లో మంగళవారం జిల్లాస్థాయి ఇన్‌స్పైర్, సైన్స్‌ఫెయిర్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ముందుగా సైన్స్ ఎగ్జిబిట్‌లను తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. విద్యతోనే సమాజం మెరుగుపడుతుందన్నారు. రాబో యే రోజుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన ఉంటుందన్నారు. పుస్తకాలు చదవడం, రాయడం మాత్రమే కాకుండా విషయ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం డీఈఓ దక్షిణామూర్తి మాట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలు, ఇంట్లో, గ్రామాల్లోని చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. గతంలో జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ పోటీల్లో విద్యార్థులు మొదటి స్ధానాలు సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకొని నూతన ఆవిష్కరణలు చేసి మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. 85 ఇన్‌స్పైర్ ప్రదర్శలు, 230 బాల వైజ్ఞానిక ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించారు. కాగా, విద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, సైన్స్ అధికారి అప్పారావు, డీసీఈబీ సెక్రటరీ బాలాజీ, జీసీడీఓ విజయకుమారి, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్‌రావు, ఎంఈఓలు బుచ్చయ్య, వెంకటేశ్వర్లు, లచ్చిరాం నాయక్, యాదగిరి, రామ్‌దాస్, శ్రీనివాస్, దేవేంద్రచారి, వీరభధ్రరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి


