మోగిన ఎన్నికల సైరన్
సాక్షి, మహబూబాబాద్: ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జిల్లాలోని మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11,14,17వ తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు సా యంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.
షెడ్యూల్ ఇలా..
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదల చేశారు. మొదటి విడత ఎన్నికలకు ఈనెల 27న నోటిఫికేషన్, ఓటరు జాబితా ప్రకటన నామినేషన్ల స్వీకరణతో మొదలై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. అలాగే రెండో విడత ఎన్నికలకు ఈనెల 30న నోటిఫికేషన్, ఓటరు జాబితా విడుదల నామినేషన్ల స్వీకరణతో మొదలై డిసెంబర్ 14న పోలింగ్, సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్‌తో మొదలై.. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. డిసెంబర్ 17వ తేదీన పోలింగ్, అదే రోజు లెక్కింపుతో పాటు అధికారులు ఫలితాలు కూడా ప్రకటిస్తారు.
మూడు విడతల్లో ఎన్నికలు..
జిల్లాలోని 482 గ్రామ పంచాయితీలకు సర్పంచ్‌లు, 4,110 వార్డులను మూడు విభాగాలుగా విభజించి ఎన్నికల పోలింగ్ తేదీలను ప్రకటించారు. గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల్లో డిసెంబర్ 11న మొదటి విడత పోలింగ్ జరగనుంది. బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో డిసెంబర్ 14న, డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విభజన..
జిల్లాలో మూడు విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విభజన చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా మొత్తం పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల నిర్వహణ ఉద్యోగులు, సిబ్బంది లభ్యత, శాంతి భద్రతల పరిరక్షణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. కాగా, 15రోజుల వ్యవధిలోనే మొదటి విడత ఎన్నికలు పూర్తి, ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలో రెండో విడత, మరో రెండు రోజుల వ్యవధిలో మూడో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. దీంతో ఇటు పోటీకి సిద్ధమయ్యే వారితోపాటు ఎన్నికల నిర్వహణ సిబ్బంది, పోలీస్ అధికారులు అంతా ఉరుకులు పరుగులు పెట్టే పరిస్థితి ఉంది.
మూడు విడతల్లో డిసెంబర్ 11,14,17వ తేదీల్లో జీపీ ఎన్నికల పోలింగ్
అదే రోజు ఓట్ల లెక్కింపు..
విజేతల ప్రకటన
మొదటి విడత ఎన్నికలకు ఈనెల 27నుంచి నామినేషన్ల స్వీకరణ
మోగిన ఎన్నికల సైరన్
మోగిన ఎన్నికల సైరన్


