
గోమయ గణపతి
మహాగణపతి..
మట్టి విగ్రహాలను పూజిద్దాం.. భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందిద్దాం అనే గొప్ప సంకల్పంతో కొందరు భక్తులు ఏళ్లుగా మట్టి, గోమయ, పేపర్ వినాయక విగ్రహాలకే జై కొడుతున్నారు. మండపాల్లో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణానికి హాని కలగని విధంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభంకానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ విధంగా పూజలు నిర్వహిస్తున్న భక్తులు, పలు మండపాల నిర్వాహకులు, సేవా ట్రస్ట్‌లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
శ్రీమహాలక్ష్మీ గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొలువుదీరనున్న గోమయ గణపతి
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్‌లో గల శ్రీ మహాలక్ష్మీ గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గోమయ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు 11 రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ట్రస్ట్ సభ్యులు శ్రీరంగం రాధిక, ఎస్.వి నాగేశ్వర్‌రావు, శ్రీరంగం రాజేశ్వరి, రామారావు, సోమ రజిత, శ్రీనివాస్, సోమ సింధు, రాంబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. 2008 నుంచి 2016 వరకు మట్టి విగ్రహాలు, 2017 నుంచి గోమయ వినాయక విగ్రహాలతో ఉత్సవాలు చేస్తున్నారు.
● మట్టి, గోమయ విగ్రహాలకే జై కొడుతున్న భక్తులు..
● ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ
● పర్యావరణానికి హాని కలగని విధంగా పూజలు
నర్సంపేట: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నర్సంపేటకు చెందిన వనప్రేమి అవార్డు గ్రహీత గోక రామస్వామి మొక్కల పెంపకంతోపాటు 40 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. అలాగే, గత సంవత్సరం నుంచి విత్తన గణపతులు తయారు చేస్తున్నారు. ప్రతీ విగ్రహంలో ఒక విత్తనం అమర్చుతున్నారు. తద్వారా నిమజ్జనం అనంతరం విత్తనం మొక్కగా రూపుదిద్దుకుని పెరిగి పండ్లు కాస్తాయని రామస్వామి తెలిపారు. ఈ విషయం తెలిసిన యునెస్కో అసోం ప్రతినిధులు రామస్వామికి శాంతిదూత అవార్డు అందజేసి సన్మానించారు.

గోమయ గణపతి