
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
ఐనవోలు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన మండలంలోని వనమాల కనపర్తిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులి యాదగిరి, నాగమ్మ దంపతులు ఈ నెల 22వ తేదీన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికెళ్లారు. తిరిగి 25న సాయంత్రం సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించి అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో భద్రపరిచిన 2 తులాల బంగారు గొలుసు, అరతులం ఉంగరం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు కనిపించలేదు. దీంతో చోరీకి గురైనట్లు గుర్తించి లబోదిబోమన్నారు. సుమారు రూ. 1.6లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయని కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ మంగళవారం తెలిపారు.
● రూ. 1.6లక్షల విలువైన వెండి, బంగారు
ఆభరణాలు అపహరణ