
అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో అక్రమ వ్యాపారాలను అరికట్టాలని కోరుతూ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌కు సోమవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల గంజాయి రవాణా, గుట్కా, బెల్లం అమ్మకాలు, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, అక్రమ వ్యాపారాలకు బాధ్యులైన వారిపై ఉక్కుపాదంమోపి అణచివేయాలని విజ్ఞప్తి చేశారు.
యూరియా సమస్య పరిష్కరించాలి
మహబూబాబాద్: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేసి సమస్య పరిష్కరించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు ఆమె వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రైతులకు యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని కొరత లేకుండా చూడాలన్నారు. రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్య సమస్యల
పరిష్కారమే లక్ష్యం
నెహ్రూసెంటర్: ఆర్‌బీఎస్‌కే ద్వారా 0 నుంచి 18 సంవత్సరాల పిల్లల ఆరోగ్య సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ (డైక్) ఏర్పాటు చేశామని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. జీజీహెచ్‌లోని డైక్, అసంక్రమిత వ్యాధుల చికిత్స కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించేలా, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి సెంటర్ పని చేస్తుందన్నారు. ఆర్‌బీఎస్‌కే ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి డైక్ సెంటర్‌కు రెఫర్ చేయాలని సూచి ంచారు. అసంక్రమిత వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని, వైద్య సిబ్బంది రోగికి మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్‌ఎంఓ జగదీశ్వర్, డెమో కొప్పు ప్రసాద్, డాక్టర్ సతీష్, డైక్ మేనేజర్ యగ్నేష్ పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
తొర్రూరు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జ్వరాల రికార్డుల నిర్వహణ పక్కాగా జరగాలని, ల్యాబ్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని బెడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పల్లె దవాఖానాల్లో ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బందితో మాట్లాడి జ్వర పీడితుల వివరాలు సేకరించి తగిన వైద్యం అందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టేలా అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌సుగుణాకర్‌రాజు, వైద్యాధికారి జ్వలిత, వైద్యులు గిరిప్రసాద్, మీరాజ్, నందన, సీహెచ్‌ఓ విద్యాసాగర్, డీపీఎంఓ వనాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీఏసీఎస్ తనిఖీ..
పట్టణ శివారులోని పీఏసీఎస్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. యూరియా విక్రయాల రిజిస్టర్ పరిశీలించారు. అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. పీఏసీఎస్ సీఈఓ మురళి, ఏఓ రాంనర్సయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కేడీసీలో జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.పల్లవి సోమవారం తెలిపారు. ‘మైక్రోబియల్ ఫ్రంట్ టైర్స్ హార్మోసింగ్ జీనోమిక్స్ సింథటిక్ బయాలజీ అండ్ మైక్రోబయోమ్ ఇన్నోవేషన్స్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలి

అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలి