
యూరియా కోసం చెప్పుల క్యూ
గూడూరు: యూరియా కోసం రైతులు ఎండలో నిలబడలేక చెప్పులను క్యూలో పెట్టిన సంఘటన మండలంలోని గాజులగట్టు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి మొదటిసారిగా 110 బస్తాల యూరియా మంజూరైంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సమీప తండా రైతులు ఉదయాన్నే చేరుకోగా.. 10 గంటలు దాటినా నిర్వాహకుడు కేంద్రం తెరవలేదు. దీంతో రైతులు తమ చెప్పులను క్యూగా పెట్టి, మండల వ్యవసాయ అధికారి, కేంద్రం నిర్వాహకుడికి ఫోన్ చేశారు. ఇదిలా ఉండగా, బస్తాల పంపిణీ కోసం కేంద్రం నిర్వాహకుడి మిషన్‌లో డీడీ నంబర్‌ను జిల్లా అధికారులు పంపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఏఓకు తెలుపగా, మధ్యాహ్నం నంబర్ పంపించారు. ఆ తర్వాత ఏఓ అక్కడ ఉండి రైతులకు బస్తాలు పంపిణీ చేయించారు.